రైతులు పండించిన పంటలకు 500 రూపాయల బోనస్ ధరను చెల్లించి కొనుగోలు చేస్తామని మోసపూరిత హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, బోనస్ ఇవ్వడం పక్కన పెడితే ఉన్న ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని , అంతేకాకుండా అధికారంలోకి వచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు 6గ్యారంటీలు హామీలను గుప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆరు హామీలను నెరవేర్చింది లేదని ఎంపీ అరవింద్ ఆరోపించారు. బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ మేరకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమకు ఎదురవుతున్న సమస్యలను ఎంపీ అరవింద్ కు విన్నవించుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమకు గన్ని సంచులు ఇవ్వడం లేదని, హమాలీలు లేరంటూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం నిలుపుదల చేశారని, ధాన్యం సంచులను కుట్టేందుకు సుతిలీలు సైతం రైతులే తెచ్చుకోవాలని హుకుం జారీ చేస్తున్నారని రైతులు తెలిపారు. ఐకెపి ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైన నాలుగు ఐదు రోజుల వరకు పెద్ద పెద్ద రైతుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని, తమలాంటి చిన్న సన్న కారు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం నిలుపుదల చేశారని ఆరోపించారు.
వాతావరణ శాఖ వర్ష సూచన తామంతా భయాం దోళనకు గురవుతున్నామని వెంటనే ఐకెపి ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునః ప్రారంభించాలని వారు ఎంపీ అరవింద్ ను కోరారు. అనంతరం ఈ విషయమై ఎంపీ అరవింద్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యన్ని తూకం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీ అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ….కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను గుప్పించి గద్దెనెక్కిందని ఇప్పుడు అన్నం పెట్టె రైతులకు అడగకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యనికి 500 రూపాయల బోనస్ ప్రకటించి మోసం చేసిందని అన్నారు. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యం లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులంతా ఇబ్బందుల్లో ఉంటే ఎమ్మెల్యే లు ఎక్కడ ఉన్నారని, రైతుల సమస్యలు వారికి పట్టవా అని అన్నారు. పసుపు రైతులు రోడ్డెక్కి పసుపు బోర్డును ఎలా సంపాదించారో అలాగే ధాన్యం రైతులు కూడా ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.