తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు
కమిటీ సభ్యులకు ఆరువేల పారితోషికం
6 గ్యారంటీలను ప్రజల దరి చేర్చే ప్రయత్నం
జూన్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
ముఖ్యమంత్రి రేవంతన్న వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగిన రేవంత్ రెడ్డి యువతను పెద్ద ఎత్తున ఆకర్షించుకోగలిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. తెలంగాణలో చతికలబడిన కాంగ్రెస్కు రేవంత్ జీవం పోసారని కాంగ్రెస్ అభిమానులు విశ్వసిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి పాలనలో తన ప్రత్యేక ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి ని కలవాలంటే ఎంతో పెద్దవారి ఆశీస్సులు ఉంటేనే సాధ్యమయ్యేది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు ప్రతి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తను అక్కున చేర్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి నీ కలిసే అవకాశం రేవంతన్న కల్పించడంతో సామాన్య కార్యకర్తలు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు, చోట మోటా నాయకుల సైతం ప్రతినిత్యం ముఖ్యమంత్రి నివాసం వద్ద క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేసి తీరుతామంటూ ఆశవాహులను ప్రతివారిని దగ్గరకు తీసుకుంటున్నారు. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి టికెట్లు రానివారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలకు గాను 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఓటమిపాలైన వారికి నిరుత్సాహానికి గురికాకుండా ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలుగా నియమించారు. తమ పార్టీ ఇన్చార్జిలదే ఫై చేయిగా భావించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక ప్రకటన సైతం చేశారు. ఓటమిపాలైన ఎమ్మెల్యే అభ్యర్థుల సైతం తాము నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించేందుకు ముఖ్యమంత్రి కల్పించిన నియోజకవర్గ ఇన్చార్జిల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇన్చార్జిల్గా ఓటంపాలైన అభ్యర్థులను నియమించడంతో వారు తమ ఓటమిని మరచి తామే ఎమ్మెల్యేలుగా భావిస్తూ ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంతో పాటు తమ స్థాయిని కూడా పెంచుకొని ముందుకు వెళుతున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు కొంత మేరకు వేరుగా ఉన్నాయని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలోనూ సూచనలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 స్థానాలు పైగా గెలుపొందాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ప్రతి నియోజకవర్గము ప్రధాన నాయకులతో ప్రతినిత్యం ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయినప్పటికీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిచదని, మరోపక్క అభివృద్ధిలో దేశంలో నంబర్ వన్ స్థానంలో నడిపి తీరుతామని గంటపదంగా రేవంతన్న నొక్కి చెప్తున్నారు. ఆనాటి కెసిఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని వేలకోట్లతో ఏర్పాటు చేసినప్పటికీ గ్రామాల్లో ప్రజలు నీటి ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని, ఏ ఒక్క గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు తమ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ మాటలతో కాకుండా చేతలతో నిధులను మంజూరు చేశారు. తెలంగాణ యువత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై గంపెడాశలు పెట్టుకుంది. యువత ఆశలు తీర్చేందుకు ఇప్పటికే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. ఉద్యోగులకు గత ప్రభుత్వం జీతాల చెల్లింపు ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు అయినా నాటినుండి ఉద్యోగులకు ఒకటో తారీకు లోపే జీతాలు చెల్లించే ప్రక్రియకు నడుం బిగించారు. అధికారాన్ని కోల్పోయిన గులాబీ దళం జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు. అయినప్పటికీ ఒక్క అడుగు కూడా వెనకకు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నాలు ఎవరికి వారే చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఒక్కరి చేతుల్లో కాకుండా తన మంత్రివర్గ టీంకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ప్రజలకు సమస్యలు తలెత్తిన సందర్భాల్లో సంబంధిత శాఖ మంత్రులు తగిన చర్యలు తీసుకుంటూ సమస్యలకు వెనువెంటనే పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. రేవంత్ టీం ఇప్పటివరకు సాఫీగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. వారి టీంలో చిచ్చు పెట్టేందుకు టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీలు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నాయి. ముఖ్యమంత్రి సహచర మంత్రులు మాత్రం తమకు ఎదురయ్యే సమస్యలు తమ కుటుంబ సమస్యలుగా భావించి వాటిని ఆంతరంగికంగా పరిష్కరించుకొని ప్రజాపాలనను కొనసాగిస్తున్నారు.
ఆరు గ్యారంటీలకు కసరత్
శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని తమ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించాలని తమ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అయితే ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలను అందించడంతోపాటు, అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు హామీలు ఇచ్చారు. 119 నియోజకవర్గాలకు గాను 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అందించే ప్రక్రియలో పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలన్న ఆలోచనతో సంక్షేమ పథకాల మంజూరు ఇంచార్జ్ మంత్రులకు ఇన్చార్జ్ మంత్రులు విడుదల చేసే తుది జాబితానే పేదలకు వరంగా వరముగా మారనుంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే ప్రక్రియలో కొన్ని ఆర్థిక పరమైన అంశాలు ఎదురవుతూ ఉన్నాయి. ఆర్థిక పరమైన అంశాలను ఎదుర్కొంటు మరోపక్క తమ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలమునకలై ఉన్నారు. ఇప్పటికే 6 గ్యారంటీల్లో మూడు గ్యారంటీలను అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అమలు చేశారు. మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం కల్పించడం పట్ల వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అనారోగ్యానికి గురైనప్పుడు పేదవారికి మెరుగైన వైద్యం అందించాలన్న దృఢ సంకల్పం తో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగులు దిద్దారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల లోపు వరకే పేదలకు వైద్య సేవలు అందేవి. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితి పెంచింది. గతంలో కొన్ని రోగాలకు వైద్య సేవలు అందించే వీలు ఉండేది కాదు అటువంటి కొన్ని సమస్యలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిష్కరించింది. మరోపక్క పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని ఇప్పటికే కల్పించారు. గతంలో పేదలు విద్యుత్ బిల్లులు చెల్లించలేక పోతే విద్యుత్ శాఖ అధికారులు పేదల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. అటువంటి పేదల ఇబ్బందులను దూరం చేసే ప్రయత్నంలో పేదలందరికీ 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం దారులకు నేడు ఉచితంగా విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నారు. రెండు లక్షల రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పదేపదే పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టి రైతులను తమ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఇప్పటికే తెలంగాణ రైతాంగం అప్పుల ఊబిలో కూరుకు పోయారు. వ్యవసాయాన్ని పరిశ్రమలుగా మార్చి నిరుద్యోగ యువతను వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సైతం అప్పల ఊబిలో కూరుకుపోయిందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి కార్పొరేషన్కు నిధులను సమకూర్చి రైతుల పంట రుణాలను రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి నేటికీ రైతులకు భరోసా ఇస్తున్నారు.
ఇందిరమ్మ కమిటీలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీర్తిశేషులు ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఆనాడు ఎంతోమంది రాష్ట్రంలోని పేదలకు ఇళ్ళు నిర్మించుకునేందుకు ఆనాటి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆనాటి నుండి ఇందిరమ్మ పేరిట పలు పథకాలను పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతూ ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇందిరమ్మ పథకాన్ని డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంగా నామకరణం చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ఆనాటి ప్రభుత్వం తెలంగాణలో కొంతమంది దరిన మాత్రమే చేర్చగలిగింది. ఆ పథకంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు సైతం అప్పుల పాలయ్యారు. అటువంటి ఇబ్బందులను తొలగించి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ ఇందిరమ్మ పథకాన్ని ఆచరణలో పెట్టేందుకు ఒక్కో నియోజకవర్గానికి 3,500ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు జీవో జారీ చేశారు. ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకున్న వారికి విడతలవారీగా లబ్ధి దారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే వీలును కల్పిస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పథకానికి తుది మెరుగులు దిద్దడం పూర్తికాకముందే పార్లమెంట్ ఎన్నికలు తన్నుకు రావడంతో సంక్షేమ పథకాల అమలు నిలుపుదల చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందిరమ్మ కమిటీల్లో చర్చించిన తర్వాత సంక్షేమ పథకాల జాబితాను తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు పేదవారికే అందించాలని గ్రామాల్లో బహిరంగంగా కమిటీల్లో చర్చించి గ్రామపంచాయతీలో జాబితాను ఏర్పాటు చేసిన అనంతరమే పథకాల ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే ఏర్పాటు చేసే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కూడా ప్రతి నెల 6000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా కొంతమంది యువతకు ఉపాధి కూడా కల్పించే ఆలోచన లో రేవంత్ అన్న ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క మహిళలకు నెలకు 2500 అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 6 గ్యారంటీ పథకాలను అమలులో పారదర్శకంగా పేదలకు అందించే విధానాన్ని అమలు చేయాలన్న దృఢ సంకల్పంతో ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు దారుల నుండి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. సంక్షేమ పథకాల అమలకు ఏ మేరకు నిధుల అవసరమవుతాయో ప్రభుత్వం వద్ద ఇప్పటికే స్పష్టమైన నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. మరోపక్క కొంతమందికి ఏళ్ల తరబడి రేషన్ కార్డులను గత ప్రభుత్వం అందించలేకపోయింది. అటువంటి కార్డులు లేని పేదలకు రేషన్ కార్డులు అందిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించింది.
జూన్ లో స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలు
గ్రామ పాలనలో ముఖ్య పాత్ర పోషించే సర్పంచుల కాల పరిమితి పూర్తి కావడంతో వారి స్థానములో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి గ్రామ పాలన కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించేందుకు ప్రత్యేక అధికారుల ద్వారా పాలన చేపడుతున్నారు. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో, స్థానిక ఎన్నికల్లో ఎవరు గెలుపొందిన గులాబీ పార్టీలో కలిసి తీరాల్సిందే అన్న హుకుం ఆనాడు జారీ చేశారు. ఆనాటి ఎన్నికల్లో ఏ పార్టీ వారు సర్పంచ్ గా గెలుపొందినప్పటికీ చేసేది ఏమీ లేక గులాబీ దళంలో కలిసిపోయారు. శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది. ఇప్పటికే ఎంతోమంది ప్రజా ప్రతినిధులు గులాబీ గూటి నుండి కారు దిగుతూ హస్తం గూటికి చేరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించి ఎదురులేని నాయకత్వంగా నిరూపించుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి వారి మంత్రివర్గం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ జూన్ 4న ముగియనుంది. కోడ్ ముగిసిన వెంటనే సంక్షేమ పథకాల అమలు ప్రారంభించి ప్రజలను మరింత చేరువ చేసుకునే ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో సైతం ప్రజలు ప్రజా ప్రతినిధులు నాయకులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. జూన్ మాసంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకోవాలన్న ప్రయత్నాలు చేస్తోంది. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ఎన్నికల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి మేమున్నామంటూ గ్రామాల్లో పార్టీకి మనోధైర్యాన్ని నింపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేరుతున్నారు. తమ పార్టీ బలోపేతానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, కాంగ్రెస్ పార్టీ మనుగడకు నిలబడ్డ కార్యకర్తలకు మాత్రం న్యాయం చేయాలని గ్రామాల్లో కాంగ్రెస్ దళం భావిస్తుంది. గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తిచేసుకుని పాలనా ప్రక్రియలో తల మునకలు అయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటినుండే ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడాది పూర్తయ్యే వరకు ఆర్థిక ఇబ్బందులతోపాటు, ఎన్నికల ప్రక్రియ కారణంగా అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాలుగేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేస్తుంది.