100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సత్తా చాటాం
తొమ్మిదన్నరేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలుచేయని బిఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతికత లేదు
కొండా మురళి, సురేఖ దంపతులు ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని నిలబడ్డవాళ్ళు
నిర్బంధాలు, ప్రతిబంధకాలకు ఎదురొడ్డి నిలిస్తేనే ప్రపంచం గుర్తిస్తుంది
మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి
నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు శ్రమించాలి
*సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి మారుపేరు అని అటవీ పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు. ప్రజాసంక్షేమమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలన సాగుతున్నదని మంత్రి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండా సురేఖ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
తన భర్త కొండా మురళి, తాను ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధించినా తట్టుకొని, మొండితనంతో ధైర్యంగా నిలబడ్డామని మంత్రి సురేఖ అన్నారు. భయపెడితే రాజకీయం చేయలేమని హితబోధ చేశారు. నేటి తరం నాయకులు, కార్యకర్తలు కేసులు అంటే భయపడుతున్నరనీ, అప్పటి నాయకులకు కేసులంటే భయం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిర్బంధాలు ఎదుర్కొంటేనే మనమంటే ఏంటో ప్రపంచం గుర్తిస్తుందని మంత్రి తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలుచేసి ప్రజా శ్రేయస్సు పట్ల తన నిబద్ధతను చాటుకున్నదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం సాగదీసినట్టుగా రైతుబంధును దశలు, దశలుగా కాకుండా ఒకేసారి 92 శాతం మంది లబ్ధిదారులకు రైతుబంధును అందించామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మిగతావారికి రైతుబంధును అందిస్తామని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి మొదలైన 100 హామీలు ఇచ్చి ఒక్కటీ సరిగా అమలుచేయని కెటిఆర్ కు కాంగ్రెస్ నైతికను ప్రశ్నించే హక్కు లేదని విమర్శించారు.
బిఆర్ఎస్ పార్టీ డబ్బులు వెదజల్లి బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన కార్యకర్తలు, నాయకులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిటిసిలు, సర్పంచులు, ఎంపిపిలు, జెడ్పిటిసిలుగా మీకు పదవులు లభిస్తాయని కార్యకర్తలకు వివరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నట్లుగానే, కేంద్రంలో అధికారంలో తెచ్చుకుంటేనే బిజెపి చేతిలో నిర్వీర్యమైన ఈ దేశాన్ని కాపాడుకునేందుకు, ప్రజలకు మంచి చేసేందుకు అవకాశం ఉంటుందని మంత్రి సురేఖ ప్రజలకు వివరించారు. గతంలో ఇందిరాగాంధీగారు పోటీ చేసిన ఈ నియోజకవర్గం నుంచి నీలం మధును గెలిపించుకుని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కి బహుమానంగా ఇస్తే, వారు సంతోషిస్తారని అన్నారు. ఎంపీగా నీలం మధును గెలిపించుకుంటేనే గతంలో కార్యకర్తలు ఎదుర్కొన్న ప్రతిబంధకాలను తొలగించుకోవచ్చని మంత్రి సురేఖ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయి, బిసి బిడ్డ నీలం మధును భారీ మెజార్జీతో గెలిపించుకోవాలి అని మంత్రి సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మంత్రి కొండా సురేఖ అపర చండిక : సంగారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్ జగ్గారెడ్డి
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, మంత్రి కొండా సురేఖ గారు శాంతమూర్తిలా కనిపిస్తున్నా ఎవరైనా దాడికి తెగబడితే మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తారని, టిడిపి అరాచకాన్ని తట్టుకొని కొండా మురళి, సురేఖ దంపతులు ఈ స్థాయికి వచ్చారని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నీలం మధు గెలుపుకు గొప్ప పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ జగ్గారెడ్డి, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన కార్పోరేషన్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, కుసుమ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.