వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం అర్థరాత్రి ట్రై సిటీలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా సంచరించారు. స్వయంగా తానే నిఘా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సందర్భముగా నగరంలో అర్థరాత్రివేళ పోలీస్ అధికారుల పనితీరుతో పాటు జన సంచారంతీరు, నిబంధనలకు అనుగుణంగా వ్యాపారస్తులు సమయ పాలన పాటిస్తున్నారా లేదా అని పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా కొద్ది మంది యువత తమ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను అధిక శబ్దం వచ్చే విధంగా మార్పు చేసి నిశి రాత్రి వేళల్లో పెద్ద శబ్దాలతో రోడ్లపై వాహనాలు నడుపుతున్నట్లుగా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదులు అందడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పోలీస్ కమిషనర్ ప్రధాన రోడ్ల మార్గాలపై నజర్ పెట్టడంతో పాటు ప్రత్యేక తనిఖీల నిర్వహణకు సిపి అధికారులకు ఆదేశాలు జారీచేసారు. అదే విధంగా ద్విచక్ర వాహనము సైలెన్సర్లు మార్పు చేస్తే సంబందిత వాహనదారులపై జరిమానాలతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇలాంటి చర్యలకు తల్లిదండ్రులు కూడా పొత్సహించవద్దని.. పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. రాత్రుల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న పనితీరును పరిశీలించారు.