జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గిరిజా శెట్కార్
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ శెట్కార్ ఎన్నికల బరిలో ఉన్నారు. 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలుపొంది జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవలందించి ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన గెలుపు కోసం తనయురాలు గిరిజా శెట్కార్ ప్రతినిత్యం నెల రోజుల నుండి ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు. డాక్టర్ గిరిజ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవాలని ఊవిళ్ళూరారు. టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయింపుకు నిరాకరించింది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో తండ్రికి రాజకీయ నేపథ్యం ఉండడం ప్రజలకు సుపరిచితుడు కావడంతో అధిష్టానం సురేష్ శెట్కార్ ను ఎన్నికల రంగంలో దింపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ కేటాయింపులు జరగకముందే డాక్టర్ ఎన్నికల బరిలో ఉండాలన్న ఉత్సాహంతో పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. తనకు టికెట్ కేటాయించ పోయినప్పటికీ నిరుత్సాహపడకుండా తన తండ్రి గెలుపు, కాంగ్రెస్ పార్టీ పటిష్టత లక్ష్యంగా భావిస్తూ ప్రతినిత్యం తన ప్రత్యేక పందాలో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు. డాక్టర్ చిన్న వయసు అయినప్పటికీ తన కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యాన్ని ఆసరా చేసుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గం లోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నహాక సమావేశాల్లో హాజరై తన సందేశాన్ని అందజేశారు.
ఓటు వేసే సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి
రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఓటు వేసే సమయంలో ప్రజలు ఆలోచన చేసి మంచి అభ్యర్థులను గెలుపొందించుకోవాలని డాక్టర్ పిలుపునిచ్చారు. రెండు పర్యాయాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గెలుపొందిన బీబీ పాటిల్ ఎంత మందికి తెలుసు ఈ ప్రాంత ప్రజలకు ఏ మేలు చేశారో అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి డబ్బు సంపాదించుకోవడానికి రావడం కాదని ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉంటేనే ఎన్నికల లో నిలబడాలని వ్యాపారాలు చేసుకునే వారికి ప్రజాప్రతినిధులుగా అడ్డుపెట్టుకొని కోట్లకు పడగలెత్తడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సురేష్ షేట్కార్ ను భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వదిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ఐదేళ్లపాటు తమ కుటుంబం సేవలందిస్తుందని కార్యకర్తలకు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతారని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడం అభినందనీయమన్నారు. మహిళా కార్యకర్తలతో ముచ్చటించారు.




