Tuesday, February 17, 2026

బోధన్ లో అట్టహాసంగా రైతు రుణమాఫీ

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న రైతులు

ద్రోణ నిజామాబాద్, జూలై 18 :

రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన రైతు రుణమాఫీ-2024 కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం రైతు సోదరులతో భేటీ అయ్యారు.

ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో గల రైతు వేదిక నుండి స్థానిక శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మా శరత్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సంకేత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార సంఘాల ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. రైతు వేదిక వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, పరస్పరం మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా బోధన్ మండలానికి చెందిన యువ రైతు రవి మాట్లాడుతూ, రూ. 2 లక్షల రుణమాఫీ అమలులోకి తెచ్చి రైతాంగానికి ఎనలేని భరోసా అందించారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. రుణమాఫీతో రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు. గత పది సంవత్సరాల నుండి రైతును నిలబెట్టే నాయకుడు రాష్ట్రంలో లేకుండాపోయారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తోడ్పాటుతో సాగు రంగంపై గట్టి నమ్మకం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, రుణమాఫీ ద్వారా రైతుల ఖాతాలలో రూ. 31 వేల కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. మొదటగా లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయడం ద్వారా గురువారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6098 కోట్ల రూపాయల నిధులను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశామని వివరించారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో రూ. 226 కోట్లు రుణమాఫీ కింద రైతుల అకౌంట్లలో పడ్డాయని సీఎం తెలిపారు. గత పాలకుల కారణంగా రాష్ట్రం 7లక్షల కోట్ల రూపాయల అప్పులలో కూరుకుపోయి, ప్రతీ నెల రూ. 7 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని అన్నారు. అయినప్పటికీ, రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ హామీని అమలు చేస్తున్నామని అన్నారు. అన్నదాతకు మేలు చేకూర్చే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, 16 సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో ఇదెంతో సుదినమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ సంకల్పం అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular