ద్రోణ నిజామాబాద్
నిజామాబాద్ ప్రోహిబిషణ్ &ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి,మత్తు పదార్థాలను అరికట్టాలని సంకల్పంతో పనిచేస్తున్నదని కానీ నిజామాబాద్ నగరంలో ఉన్న 3 కల్లు డిపోల్లో గీతకార్మికులను సిట్టింగ్ జీతం పేరుతో పక్కనపెట్టి చెట్లనుండి కల్లు తీయకుండా కేవలం నీళ్లలో ఆల్ఫోజోలం, ఇతర మత్తు పదార్థాలను కలిపి కల్తీకల్లు తయారు చేస్తున్న ఘనత కల్లు కాంట్రాక్టర్లదేనని అన్నారు.ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఏ కల్లు డిపోకు ఎక్కడ ఈత, తాటి,ఖర్జూర వనం కేటాయించారో ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం సంబంధిత ఎక్సైజ్ అధికారులపై ఉన్నదని అన్నారు. నిజామాబాద్ నగరంలో ఎక్సైజ్ ఈ ఎస్, సి ఐ, ఎస్సై,ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ కల్లులో ఆల్ఫాజోలం మరియు ఇతర ప్రమాదకరమైన మత్తు పదార్థాలను కలిపి కల్లుప్రియులకు అలవాటు చేసి కల్తీ కల్లుకు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ స్పందించి కల్లు డిపోలలో తనిఖీలు చేసి కల్లును కల్తీ చేస్తున్న కాంట్రాక్టర్లను వెంటనే అరెస్టు చేసి కల్తీ కల్లును తయారు చేస్తున్న డిపోలను, విక్రయిస్తున్న కల్లు దుకాణాలను సీజ్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎక్సైజ్ అధికారులను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, పి.నర్సింగ్ రావు, బి.రఘురాం, సక్కి.సురేష్,కె.గంగాధర్, అమర్,భాను, వంశీ తదితరులు పాల్గొన్నారు.
