ద్రోణ హైదరాబాద్
తన ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ములుగు లో ప్రత్యక్షమవుతారు. మంత్రి సీతక్క. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాదు మంత్రి అయిన తర్వాత అదే వొరవడినీ కొనసాగిస్తున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇష్టపడే సీతక్క గత నాలుగు ఐదు రోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అదే సమయంలో ములుగు లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ, ఇరిగేషన్ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో తన ప్రజలకు దూరంగా హైదరాబాదులో సీతక్క ఉండలేకపోయారు. గతేడాది వర్షాలతో ములుగు వనికిపోయింది. వరదల్లో పలువురు మృత్యువాత పడ్డారు. అప్పుడు స్వయంగా మోకాలు లోతు నీటిలో ప్రజలకు అండగా నిలిచి సహాయక చర్యల్లో సీతక్క పాల్గొన్నారు. ఇప్పుడు వర్ష జోరు పెరిగిన నేపథ్యంలో..శనివారం నాడు సచివాలయం నుంచి ఆదిలాబాద్ ములుగు జిల్లాల్లో వరద పరిస్థితి పై సమీక్ష నిర్వహించిన సీతక్క, ఆదివారం నాడు జ్వరంతో బాధపడుతూనే ఎడతెరిపిలేని వర్షంలోనే ములుగు కు చేరుకుని వర్షాలు వరదలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. వరద ఉదృతిని పరిశీలించారు. గోదావరి సమీప గ్రామాల్లో వున్న పరిస్థితులను స్వయంగా పరిశీలన చేశారు. ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేశారు. ములుగు ఫ్లడ్ కంట్రోల్ రూం నుంచి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వరదలు నేపథ్యంలో సహాయక కార్యక్రమాలను సమన్వయం చేస్తున్న విభాగాల అధికారులతో సమీక్ష చేపట్టారు. వాతావరణ శాఖ మలుగు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏదైనా సమస్య తలెత్తితే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సన్నద్దతపై ఆరాతీసిన మంత్రి సీతక్క, ఇలాంటి రిస్క్ తీసుకోకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసి ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరదలతో ఎక్కువగా ప్రభావితం అయ్యే లోతట్టు గ్రామాల ప్రజలకు జిల్లా అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
అవసరం ఉంటే తప్ప బయటకు ఎవ్వరూ రావద్దని, ముఖ్యంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎవ్వరూ కూడా చాపల వేటకు వెళ్లకుండా అధికార యంత్రాంగం గస్తీ పెంచాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు ములుగు జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ, పోట్లను ఎన్ డి యఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సీతక్క అభయంతో ములుగు జిల్లా ప్రజలకు ధైర్యం నింపుతున్నారు.
