4 లక్షల టన్నుల అక్రమ తవ్వకాలు
4 గుత్తేదారు సంస్థలు బ్లాక్ లిస్ట్లోకి
ఐదుగురు ఔట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
ద్రోణ కామారెడ్డి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మంజీరా నదిలో చెక్ డ్యామ్ పేరు చెప్పి గత నాలుగేళ్లుగా అక్రమంగా ఇసుక దోచుకున్నారు . ఈ విషయంపై ఇసుక గుత్తేదారులు, ఖనిజ అభివృద్ధి సంస్థ అధికారులు కుమ్మక్కై వే బిల్లులు లేకుండా మంజీరా నది నుంచి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలించుకు పోయినట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ విషయంపై అక్రమ ఇసుక బకాసురులపై ప్రభుత్వం చర్య తీసుకుంది. అధికార బలం, కండబలం, ఆర్థిక బలంతో మంజీరా నదిలో నాలుగేళ్లుగా అక్రమ ఇసుక దందా కొనసాగుతూ వస్తుంది. ఈ విషయంలో గత గులాబీ పాలకులు ఇసుక అక్రమ దారులకు అండగా నిలవడంతో భారీ ఎత్తున ఇసుక మంజీరా నది నుంచి తరలిపోయి, మట్టి తేలింది ఈ మట్టిపై పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడివిగా మారింది. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది.కామారెడ్డి జిల్లాలోని మంజీరా నది పరీవాహక ప్రాంతంలో లక్షల టన్నుల ఇసుక ఆక్రమ విక్రయాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. అటు గుత్తేదారులు, ఇటు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎం డీసీ) సిబ్బంది కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి జేబులు నింపుకొన్న ఉదంతంలో నాలుగు గుత్తేదారు సంస్థల బ్యాంకు గ్యారంటీని జప్తు చేయడంతో పాటు ఆ సంస్థలను బ్లాక్ లిస్టులో చేర్చింది. ఐదుగురు పొరుగుసేవల సిబ్బందీని విధుల నుంచి తొలగించింది. ప్రాజెక్టు అధికారికి మెమో ఇచ్చినట్లు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వం సుమారు రూ.50 కోట్ల ఆదాయం నష్టపోయినట్లు సమాచారం.
