ద్రోణ బిచ్కుంద
జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల మార్కెట్ యార్డులో ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభకు మాదిగ, దండోరా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.
మండల కేంద్రంలో డప్పు దరువులతో భారీ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే డప్పు కొట్టి మాదిగ సోదరులు, కార్యకర్తలలో ఉత్సాహన్ని నింపారు.

ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుని వేదిక మీద ఏర్పాటు చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్, అన్నా భావు సాఠె,బసవేశ్వర్ మహారాజ్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
మాదిగల మూడు దశాబ్దాల నిరీక్షణ ఫలించిందన్నారు.
ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.తెలంగాణ పోరాటంలో మాదిగ విద్యార్థుల తీరు మరువలేనిదన్నారు.ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి దామోదర రాజ నరసింహా నేతృత్వంలో తనతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించామని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం చేసిన కృషి మరియు వారు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతి రుణపడి ఉంటుందని అన్నారు.వర్గీకరణ విషయంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, నరేంద్ర మోడీ గానీ,బీజేపీ నాయకులకు గానీ ఎటువంటి కృషి చేయలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడుతామని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మాదిగలకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి పరిపూర్ణంగా అమలు అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

మాదిగలు అందరూ ఐక్యమత్యంగా ఉండి జాతి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.మాదిగలు అందరూ తన కుటుంబం అని,జాతి కోసం తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ,మాదిగ, దండోరా నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
