ద్రోణ హైద్రాబాద్
హైద్రాబాద్ విశ్వ నగరంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఒక్క ఐటీ రంగమే కాకుండా అనేక రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైద్రాబాద్ పేరు కూడా ఉందనడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం నగరంలో సాధించిన అద్భుత విజయాలెన్నో..ప్రస్తుతం భారత దేశంలో అత్యంత ఖరీదైన భవనాలు కొనే శక్తి కేవలం హైద్రాబాదీలకు మాత్రమే ఉందని తేలిపోయింది. దీంతో నగరంలో భూముల ధరలు ఇబ్పడిముబ్బడిగా పెరిగిపోయాయి. హైద్రాబాద్‌లో భూమి ధర ఎక్కడ అత్యంత ఖరీదు ఉంటుందని ఎవరైనా ప్రశ్నిస్తే ఏ బంజారో హిల్సో, జూబ్లీ హిల్ లో, గచ్చిబౌలో, కోకాపేట్ లో, హైటెక్ సిటీలో అని ఠక్కున సమాధానం చెబుతాం. అయితే ఇది పూర్తిగా తప్పు. ఈ ప్రాంతాల్లో గజం జాగా ధరం 3 నుంచి 5 లక్షలు..తప్పితే ఒక లక్ష అటో ..ఇటోగా ఉంటుంది. కానీ నగరంలోని ఒక ప్రాంతంలో గజం ధర 20 లక్షలు పలుకుతోందంటే మీరు నమ్ముతారా..?. నమ్మాలి..ఎందుకంటే అది పచ్చి నిజం. అది ఏ ప్రాంతమో కాదు.హైదరాబాద్ పాత నగరాన్ని అనుకొని బేగం బజార్. అవునండి..ఇక్కడ గజం భూమి ధరం అక్షరాలా 20 లక్షలు పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్లకు నెలవైన బేగం బజార్ ప్రాంతంలో చూసినా భూములు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీనికి కారణం బేగం బజార్ మార్కెట్ లను శాసిస్తున్న ఉత్తరాదికి చెందిన వ్యాపారులే. మహరాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన ఈ వ్యాపారులు ఎన్నో దశాబ్దాల క్రితమే హైదరాబాద్ నగరానికి వలస వచ్చి బేగం బజార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిర పడ్డారు. అద్దె ఇళ్లలో నివసించే వీరంతా 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడగానే హైదరాబాద్ ను స్థిర నివాసంగా మార్చుకున్నారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారుల అంతా ఆ రాష్ట్రానికి తరలిపోయారు. దీన్ని అంది వచ్చిన అవకాశంగా భావించిన ఉత్తరాది వ్యాపారులు వారికి చెందిన ఆస్తులను పూర్తిగా దక్కించుకున్నారు. అయినా కూడా బేగం బజార్ చుట్టు పక్కల స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి వారికి స్థలం దొరకడం గగనమైపోయింది. దీనికితోడు 2014 తర్వాత ఉత్తరాది వ్యాపారులు తమ కార్యకలాపాలను ఉత్తరాదితో పాటు దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలకు విస్తరించి అమిత లాభాలు అర్జించారు. దీంతో బేగం బజార్ ప్రాతంలో స్థలం దొరకడమే చాలు వారు ఎంత రేటు పెట్టి కొనడానికైనా సిద్ధ పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఇంకో విశేషం ఏమిటంటే..ఏదైనా భూమి అమ్మకానికి వస్తే గజం ధర నిర్ణయానికి వేలం వేయడం. ముందుగా ఒక గజం భూమిని వేలానికి పెట్టి ఎవరు అత్యధిక ధరకు కొనుగోలు చేస్తే మిగిలిన భూమిని ఆ రేటు ప్రకారం విక్రయిస్తున్నారు. ఇదండీ బేగం బజార్ భూమలు కథా కమామీషు వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది.
