Sunday, February 15, 2026

జాతీయ రహదారుల అభివృద్ధి తోనే ప్రాంత అభివృద్ధి సాధ్యం

మెరుగైన రవాణా సౌకర్యాలు ఉన్నపుడే అభివృద్ధి సుగమం

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

వరంగల్ పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధి పై ద్రుష్టి సారించిన ఎంపీ డా. కడియం కావ్య. జాతీయ రహదారుల అభివృద్ధితోనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
నేషనల్ హైవేస్ రీజినల్ ఆఫీసర్ కి జాతీయ రహదారుల అభివృద్ధి పై వినతి పత్రాలు అందజేసిన ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

అభివృద్ధిలో జాతీయ రహదారుల పాత్ర అత్యంత కీలకమని మెరుగైన రవాణా వ్యవస్థ కలిగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.
హైదరాబాద్ లోని నేషనల్ హైవేస్ కార్యాలయంలో రీజినల్ ఆఫీసర్ శివ శంకర్ ని కలిసి వరంగల్ పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధికి సంబందించిన వినతి పత్రాలను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య అందజేశారు.
ఈ సందర్బంగా రీజినల్ ఆఫీసర్ శివ శంకర్ కి పలు సమస్యలను ఎంపీ డాక్టర్ కడియం కావ్య వివరించారు. నేషనల్ హైవే 163 హైదరాబాద్ నుండి భూపాలపట్నం జాతీయ రహదారి లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని నిడిగొండ, చాగల్, స్టేషన్ ఘనపూర్, చిన్న పెండ్యాల, కరుణపురం వరకు సర్వీస్ రోడ్డును పొడగించాలని కోరారు. ఆయా గ్రామాలకు అనుసంధానంగా సర్వీస్ రోడ్డు లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చిన్న పెండ్యాల గ్రామ పరిధిలో సెంట్రల్ లైటింగ్ లేనందున ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. కావున సర్వీస్ రోడ్డు పొడగింపుతో పాటు ఆయా గ్రామాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదలను తగ్గించడానికి వీలు కలుగుతుందని అన్నారు. అలాగే జాతీయ రహదారి- 563లో భాగంగా వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలని కోరారు. జాతీయ రహదారి -563 జగిత్యాల నుండి కరీంనగర్ నుండి వరంగల్ నుండి ఖమ్మం వరకు విస్తరించి ఉందని అందులో జగిత్యాల నుండి వరంగల్ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వరంగల్ నుండి ఖమ్మం వరకు నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని కాని రెండు లైన్ల రహదారిగానే ఉందని అన్నారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, పారిశ్రమిక, వాణిజ్య వాహనాలు మరియు సరుకుల రవాణా పెరిగి పోయిందని వివరించారు. ప్రయాణికుల భద్రత మరియు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జాతీయ రహదారి -563లో వరంగల్ నుండి ఖమ్మం వరకు నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. అలాగే జాతీయ రహదారి-353 లో సి ఆర్ నగర్, భూపాలపల్లి నుండి ఘనపూర్ వరకు బై పాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. భూపాలపల్లి పట్టణం వాణిజ్య పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణమని అన్నారు. బొగ్గు, ఇసుక, యాష్ లిఫ్టింగ్ తో భారీ వాణిజ్య వాహనాలు పెరగడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దింతో పాటు రోడ్డు ప్రమాదాలు పెరగడం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని వివరించారు. భద్రత కారణంగా భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడుతుందని కావున బై పాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ చెప్పిన పై విషయాలపై సానుకూలంగా స్పందించిన నేషనల్ హైవేస్ రీజినల్ ఆఫీసర్ శివ శంకర్ నిడిగొండ, చాగల్, స్టేషన్ ఘనపూర్, చిన్న పెండ్యాల, కరుణాపురంలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరియు సెంట్రల్ లైటింగ్ ను వెంటనే ఏర్పాటు చేస్తామని దీనికి సంబందించి వరంగల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ని స్థల పరిశీలన చేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సర్వీస్ రోడ్ల ఏర్పాటును పరిశీలించి ప్రతిపాదనలు నేషనల్ హైవే అథారిటీ కి పంపిస్తామని తెలిపారు. అలాగే వరంగల్ -ఖమ్మం నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి సంబందించిన ప్రతిపాదనలు సైతం నేషనల్ హైవే అథారిటీ కి పంపిస్తామని వెల్లడించారు. భూపాలపల్లి బైపాస్ రోడ్డు 660కోట్లతో మంజూరు అయి టెండర్ దశలో ఉందని, వీలైనంత తొందరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్, NHAI అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular