కరుణించని రోడ్లు భవనాల శాఖ
నాలుగు నెలలుగా బస్సులు నిలిపివేత
విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
చిత్తడిగా మారుతున్న రహదారి
ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన అధికారుల నిర్లక్ష్యం
ప్రజలకు శాపంగా మారిన వైనం
ద్రోణ బోధన్ ప్రతినిధి
రహదారుల విస్తరణ, హై లెవెల్ వంతెనల నిర్మాణాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తుంది. రహదారుల అభివృద్ధితోనే ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్న లక్ష్యంతో ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల పరివేక్షణలోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతుంది.

బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని రహదారులు వంతెనల నిర్మాణాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ రోడ్లు భవనాల శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడడం, పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులను పూర్తి చేయకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పోతంగల్ మండలంలోని సుంకిని,కొల్లూరు నుండి బోధన్ కు వెళ్లే రహదారిని మరింత విస్తరింప చేయడంతో పాటు లో లెవెల్ వంతెనల స్థానంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు బాన్సువాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి తన శాయ శక్తులా కృషి జరుపుతూ నిధుల మంజూరు చేయించుతున్నారు.

గతంలో దోమలేడిగి, చెక్కి క్యాంప్ గ్రామాల సమీపంలో లో లెవెల్ వంతెనలు ఉండేవి వర్షాకాలం రాగానే వాగులు పొంగిపొర్లడంతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుండేది. వర్షాకాలంలో రోడ్లపై నీరు ప్రవహించడంతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అటువంటి లో లెవెల్ వంతెనల స్థానాల్లో హై లెవెల్ వంతెనలు నిర్మించారు. మరోపక్క సుంకిని నుండి బోధన్ కు వెళ్లే రహదారిని డబుల్ లైన్ రహదారి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రహదారి విస్తరణతో పాటు, కొల్లూరు గ్రామ సమీపంలో హై లెవెల్ వంతెన నిర్మాణానికి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిధుల మంజూరు కి కృషి చేశారు. ఎన్నికల ముందర నిధులు మంజూరు చేయడం ఆనాటి నుండి ఏడాది గడుస్తున్నా నేటి వరకు పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి.
సుంకిని కొల్లూరు గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిపివేత

కొల్లూరు గ్రామ సమీపంలో వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అట్టి పనులను రహదారులు భవనాల శాఖ ఓ కాంట్రాక్టర్ కి పనులను అప్పగించారు. గత ఏడాది వర్షాకాలం ముందు కాంట్రాక్టర్ పనులను ప్రారంభించారు. ప్రారంభం నుండి నత్తనడకన పనులను చేపట్టారు. పనులను పరివేక్షించాల్సిన అధికారులు మాత్రం ఏనాడు ఈ పనుల పర్యవేక్షణ జరిపిన పాపాన పోలేదు. నో లెవెల్ వంతెన ఉండడం వల్లన వర్షాకాలంలో ఎన్నో ఏళ్ళు ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. వర్షం పడిందంటే చాలు వాగులు పొంగిపొర్లుతూ ఉండేవి. వర్షం పడిందంటే చాలు రహదారిపై కాలువల్ల నీరు ప్రవహిస్తూ ఉండేది. వర్షం పెద్ద ఎత్తున పడిన సందర్భాల్లో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రహదారుల అభివృద్ధితోనే ప్రాంతాలు అభివృద్ధి సాధ్యమన్న ఆలోచనతో పాలకులు నిధులు మంజూరు చేశారు. పనులు చేపట్టడంలో అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. లో లెవెల్ వంతెన ఉన్న సందర్భాల్లో భారీ వర్షం పడ్డ సందర్భాల్లో మాత్రమే రాకపోకలు నిలిచిపోయాయి. హై లెవెల్ వంతెన నిర్మాణ పను లు చేపడతామంటూ ఉన్న లో లెవెల్ వంతెనను తొలగించి రోడ్డు మళ్లింపు చేశారు. రోడ్డు మళ్లింపులో అధికారులు ఏనాడు పర్యవేక్షణ జరపకుండా, కళ్ళు మూసుకున్నారు. ఆనాటి కాంట్రాక్టర్ రోడ్డు మళ్లింపులో మమ అనిపించుకుని చిన్నపాటి పైపులను ఏర్పాటు చేశారు. గత ఏడాది మొదటి వర్షానికి రోడ్డు మళ్లింపు కోతకు గురైంది. ఏడాది క్రితం పనులను చేపట్టాల్సిన కాంట్రాక్టర్ పై పాలకులు ఫైర్ అయ్యారు. ఇదే అదునుగా భావించి కాంట్రాక్టర్ సైతం పనులను చేపట్టలేనని చేతులెత్తేశారు. కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆరు నెలల పాటు సాగదీశారు. ఆరు నెలల తర్వాత అట్టి పనులను రద్దు పరుస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి పనులను వేరే కాంట్రాక్టర్ కు అప్పగించారు. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ సైతం కొంతవరకు పనులు వేగంగా చేపట్టి అర్థఅంతరంగా బ్రిడ్జి పనులను నిలిపివేశారు. జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయింది. గత, ప్రస్తుత వర్షాకాలంలో తాత్కాలిక రోడ్డు కోత కు గురైనప్పటికీ ఏనాడు సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. గత మూడు నెలలుగా తాత్కాలిక రోడ్డు శిధిలం కావడంతో రోడ్డు రవాణా శాఖ బస్సులను రద్దుపరిచింది. లో లెవెల్ వంతెన ఉన్న సందర్భాల్లో భారీగా వర్షం పడిన రోజుల్లో మాత్రమే రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగేది, హై లెవెల్ వంతెన పనుల పేరిట అధికారుల నిర్లక్ష్యం కొల్లూరు, సుంకిని, హెగ్డోలి, కారేగాం తదితర గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. గత మూడు నెలలుగా రవాణా సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి వేయాల్సిన పైపుల విషయంలోనూ సంబంధిత అధికారులు పూర్తి నిర్లక్ష్యం చేశారు. గత ఏడాది కోటగిరి మండలానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి తన సొంత డబ్బుతో పైపులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ హై లెవెల్ వంతేన పేరిట నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఈ ప్రాంత విద్యార్థులు బోధన్ పట్టణంలో ఎంతోమంది విద్యను అభ్యసిస్తున్నారు. రవాణా శాఖ బస్సులను నిలిపివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం సంబంధిత శాఖ అధికారులు తాత్కాలిక రోడ్డు మరమ్మతులు కూడా చేపట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వాలు మారిన ప్రజల తలరాతలు మారలేదన్న చర్చ పెద్ద ఎత్తున ప్రజల్లో కొనసాగుతుంది. ఇప్పటికే ఎంతోమంది ద్విచక్ర వాహనదారు లు పడరాని పాట్లు పడుతూ ప్రయాణాలు చేపడుతున్నారు. ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పాలకులు స్పందించి తాత్కాలిక రహదారి పనులైనా చేపట్టి బోధన్ కు బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రహదారి విస్తరణ చిత్తడి

సుంకిని బోధన్ రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అతి పనులను ఓ మోతుబరి కాంట్రాక్టర్ పనులను దక్కించుకున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పనులను చేపట్టడానికి కొంత వెనక ముందు ఆలోచన చేశారు. కొన్ని నెలల తర్వాత పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు వచ్చారు. రహదారి పనులు చేపట్టినట్లు చేపట్టి మొరం తోలారు వదిలివేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో వినియోగించిన మొరం కొనిచోట్ల నాణ్యతా లోపం ఉండడంతో వర్షం పడిందంటే చాలు చిత్తడిగా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి పనులను చేపట్టాల్సిన కాంట్రాక్టర్లతో మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయె అన్నచందంగా మారింది. పాలకులు కరుణించి ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
