రైతులకు భరోసా ఇచ్చిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
ద్రోణ ప్రతినిధి:-
రైతులు పండించిన పంటలన్నిటిని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని, దళారులను ఆశ్రయించి రైతులు పంటల అమ్ముకొని మోసపోవద్దని రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు బోధన్ నియోజకవర్గంలో ప్రారంభిస్తామని మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బోధన్ నియోజకవర్గంలోని సాలూర, ఖాజాపూర్ మంద ధర్నా మరియు హున్సా గ్రామాల్లో సోమవారం మాజీమంత్రి పర్యటించారు.

ఆరబెట్టిన సోయా పంటను పరిశీలించారు. పంటల స్థితిగతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధరను సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బోధన్ నియోజకవర్గంలో బుధవారం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులు దళారులకు పంటలు అమ్ముకుంటే తూకంలో మోసాలు, ధరలో వ్యత్యాసం కొన్ని సందర్భాల్లో దళారులు పంట కొనుగోలు చేసిన డబ్బును కూడా ఎగవేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ఆరబెట్టిన పంటలు చేర్చాలన్నారు.


వరి పంట సాగు కూడా మన ప్రాంతంలో ముందస్తుగా చేయడంతో పాటు తక్కువ కాలంలో వారి వంగడాలను రైతులు సాగు చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలోనే ముందస్తుగా నిజాంబాద్ జిల్లాలో పంటలు చేతికి అందుతున్నాయని అన్నారు. రైతులకు అనుకూలంగానే ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల విధివిధానాలను ఖరారు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్, పిసిసి డెలిగేట్ గంగా శంకర్, హంస సింగిల్ విండో మందర్న రవి, కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు, అల్లే జనార్ధన్, శివకుమార్, ప్రకాష్, బోధన్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు చీల శంకర్, అశోక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
