Friday, August 14, 2026

విజయవాడ–వారణాసి విమాన సర్వీసులు

ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

హైదరాబాద్ ఆగస్టు 13 ద్రోణ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు గురువారం ప్రారంభమయ్యాయి.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ నూతన విమాన సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు. విజయవాడ–వారణాసి మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాశీ యాత్ర మరింత సులభతరం కానుంది.వారణాసి దేశంలోని అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో ఒకటి. శ్రీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకునే భక్తులతో పాటు, విద్య, వ్యాపారం, పర్యాటకం, సాంస్కృతిక అవసరాల కోసం ప్రయాణించే వారికి ఈ నేరుగా విమాన కనెక్టివిటీ ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.కాగా ఈ విమాన సర్వీసులు వారానికి మూడు రోజుల పాటు మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటాయి. దీంతో విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల ప్రజలకు వారణాసితో మెరుగైన ప్రయాణ సౌలభ్యం ఏర్పడనుంది.ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు, దేశంలోని టైర్-2, టైర్-3 నగరాలను ప్రధాన విమాన కేంద్రాలతో అనుసంధానం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.విజయవాడ–వారణాసి నేరుగా విమాన
సర్వీసు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ కొత్త సర్వీసు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చనుంది. ఇంకోవైపు హుస్సేన్ సాగర్, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్ట్ మధ్య కూడా సీ ప్లేన్ ప్రాజెక్ట్ కోసం వ్యూహరచన సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, కేశినేని శివనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ సెక్రటరీ సమీర్ కుమార్ సిన్హా, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, ఇండిగో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular