Friday, August 14, 2026

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు

జిల్లా ఎస్పీ విద్యాసాగర్

అమరావతి ఆగస్టు 13 ద్రోణ

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2026 జనవరి నుంచి జూలై వరకు నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల కేసులు, రౌడీ–సస్పెక్ట్ షీటర్ల బైండ్‌ఓవర్ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ అధికారులతో హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఎస్పీ నేరాల సంఖ్యను తగ్గించడంతో పాటు, నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల స్వభావాన్ని విశ్లేషించి, నేరాలకు కారణమయ్యే అంశాలను గుర్తించి పటిష్టమైన ప్రివెంటివ్ పోలీసింగ్ చేపట్టాలని సూచించారు. పెండింగ్ దర్యాప్తు కేసులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి. దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి చార్జిషీట్లు/ఫైనల్ రిపోర్టులు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు. జిల్లాలో లాంగ్ పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు 30 శాతం తగ్గినప్పటికీ, మిగిలిన కేసులపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.తీవ్ర నేరాల దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావివ్వకూడదని, నేర స్థల పరిశీలన, ఆధారాల సేకరణ, సాంకేతిక ఆధారాల వినియోగం, నిందితుల గుర్తింపు తదితర అంశాల్లో శాస్త్రీయ దర్యాప్తు చేపట్టాలని సూచించారు. జిల్లాలో గ్రేవ్ కేసుల డిటెక్షన్ శాతం 2025లో 92.54 శాతం ఉండగా, 2026 జనవరి–జూలైలో 94.74 శాతానికి పెరిగిందని, ఈ పనితీరును మరింత మెరుగుపరచాలని తెలిపారు.రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. వారి కదలికలను పర్యవేక్షిస్తూ, నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రౌడీ షీటర్ల బైండ్‌ఓవర్ 80.6 శాతం ఉండగా, సస్పెక్ట్ షీటర్ల బైండ్‌ఓవర్ 66.2 శాతంగా ఉన్నందున సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మహిళా పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు ఇతర సంబంధిత వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలని తెలిపారు.మిస్సింగ్ కేసుల్లో ప్రతి కేసును సీరియస్‌గా తీసుకుని తక్షణమే ట్రేస్ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 2026 జనవరి–జూలైలో మిస్సింగ్ కేసుల మొత్తం ట్రేసింగ్ శాతం 90.37గా నమోదైందని, 48 గంటల్లో ట్రేసింగ్‌పై కూడా మరింత దృష్టి పెట్టాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సూచించారు. NDPS కేసుల్లో నిందితులపై చట్టపరమైన చర్యలతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే మూలాలను గుర్తించి నెట్‌వర్క్‌ను ఛేదించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 2026 జనవరి–జూలైలో NDPS కేసులు 24 నమోదయ్యాయి.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఎస్పీ గారు ఆదేశించారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 2026లో కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిరంతర తనిఖీలు నిర్వహించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలతో నిరంతరం మమేకమై సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం కలిగించే విధంగా విధులు నిర్వహించాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని తెలిపారు.
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు, సామాన్య ప్రజలకు పోలీస్ సేవలు మరింత అందుబాటులో ఉండేలా పనిచేయాలని, నేరాల నియంత్రణ, కేసుల సత్వర దర్యాప్తు, నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతమైన దర్యాప్తు, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి అధికారి, సిబ్బంది పనిచేయాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.జిల్లాలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ , ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular