Friday, August 14, 2026

రాష్ట్రస్థాయిలో కామారెడ్డి విద్యార్థులకు గుర్తింపు

విద్యార్థులకు కంప్యూటర్లను అందించిన సీఎం

రాష్ట్ర స్థాయి ఇంటర్‌లో ప్రతిభ చాటిన కామారెడ్డి విద్యార్థులకు ఘన సన్మానం

హైదరాబాద్ ఆగస్టు 13 ద్రోణ

కామారెడ్డి సాందీపని కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కామారెడ్డి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ల చేతుల మీదుగా హైదరాబాదులోని బంజారా కొమరం భీం భవన్లో ఘనంగా సన్మానించారు.
ఇంటర్మీడియట్ బైపీసీ ప్రథమ సంవత్సరంలో సాందీపని కళాశాలకు చెందిన ఐమాన్ మసీర 440 మార్కులకు గాను 439 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించారు. అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల ఆమెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అభినందించారు.
ఇంటర్మీడియట్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఆస్మా జబీన్ రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించి విశేష ప్రతిభను కనబరిచారు. ఇద్దరు విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం వారిని ఘనంగా సత్కరించి, ప్రోత్సాహకంగా ల్యాప్‌టాప్‌లను అందజేసింది.
ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.
కామారెడ్డి పట్టణానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించడం పట్ల సాందీపని కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐమాన్ మసీర, ఆస్మా జబీన్లను పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, కళాశాల యాజమాన్యం అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular