Sunday, February 15, 2026

ఈ నెలాఖరు వరకు ప్రవేశాలకు అవకాశం

మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు దోహదం

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి

ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి

మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) దోహదపడతాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఆయా జిల్లాలలో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలకు సంబంధించిన ప్రగతిపై శుక్రవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాలను అర్హులైన విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని, ఈ నెలాఖరు లోపు పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలని సూచించారు.వీ.సీ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏటీసీ కేంద్రాల గురించి అవగాహన పెంపొందించేందుకు వీలుగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఏటీసీ కేంద్రాలలో శిక్షణ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఒకటిరెండు రోజుల్లోనే తాను క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలిస్తానని అన్నారు. తొలి విడతగా జిల్లాలోని నిజామాబాద్, బోధన్, కమ్మర్ పల్లిలో ఏటీసీ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఐ.టీ.ఐ ప్రాంగణాలలోనే ఏటీసీ కేంద్రాలను కొనసాగిస్తూ, ఆయా కోర్సులలో శిక్షణను ప్రారంభించడం జరుగుతుందని, త్వరలోనే అన్ని వసతులు, సదుపాయాలతో నూతన భవనాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఏటీసీ కేంద్రాలలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ ( ఒక సంవత్సరం కాల వ్యవధి) కోర్సు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిషియన్స్ ( ఒక సంవత్సరం), ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ ( ఒక సంవత్సరం), బేసిక్ డిజైనర్ అండ్ వర్చ్యువల్ వెరిఫైర్-మెకానికల్ (రెండు సంవత్సరాలు), అడ్వాన్స్డ్ సీ.ఎన్.సీ మషీనింగ్ టెక్నీషియన్ (రెండు సంవత్సరాలు), మెకానిక్ ఎలెక్ట్రిక్ వెహికల్ (రెండు సంవత్సరాలు) కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ కోర్సులను పూర్తి చేసుకున్న వారికి వారి సామర్ధ్యాన్ని బట్టి వివిధ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందేందుకు ఈ అధునాతన కోర్సులు దోహదపడతాయని కలెక్టర్ సూచించారు. స్వయం ఉపాధిని ఏర్పర్చుకుని పారిశ్రామికవేత్తలుగా స్థిరపడవచ్చని అన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులలో చేరేందుకు అర్హులని తెలిపారు. ఎస్సెస్సీ మెమో, టీ.సీ, కుల ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని సూచించారు.

ప్రవేశాలకు ఈ నెల 31 చివరి తేదీ అయినందున గడువులోపు అర్హత, ఆసక్తి కలిగిన వారు ఏటీసీ కేంద్రాలలో నిర్దేశిత కోర్సులలో ప్రవేశాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యాలయ పని రోజుల్లో ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిజామాబాద్ ప్రభుత్వ బాలుర(పాత) ఐ.టీ.ఐ, బోధన్ ప్రభుత్వ ఐ.టీ.ఐ, కమ్మర్పల్లి ప్రభుత్వ ఐ.టీ.ఐలో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, సంబంధిత ఐ.టి.ఐ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular