కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్
ద్రోణ నిజామాబాద్
మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను విద్యార్థినీ విద్యార్థులు, యువతీ, యువకులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా నూతన కోర్సులలో ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ కుమార్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆయా జిల్లాలలో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల భవన నిర్మాణాలు, నూతన కోర్సులలో అడ్మిషన్లకు సంబంధించిన ప్రగతిపై శుక్రవారం ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఏటీసీ భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. వీటి నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలలో (ఐ.టీ.ఐ)లలో ఏటీసీ కోర్సులను కొనసాగించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే ఐ.టీ.ఐలలో విద్యుత్ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని, ఏటీసీ కేంద్రాలకు కేటాయించిన అధునాతన యంత్రసామాగ్రిని అభ్యర్థులకు శిక్షణ అందించేందుకు వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ, నిజామాబాద్, బోధన్, కమ్మర్ పల్లి ఏటీసీ కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని ప్రవేశాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్లలో పురోగతి సాధించామని తెలిపారు. వీ.సీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఏటీసీ కేంద్రాలలో ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్దేశిత కోర్సులలో శిక్షణ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

తొలి విడతగా జిల్లాలోని నిజామాబాద్, బోధన్, కమ్మర్పల్లిలో ఏటీసీ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ ( ఒక సంవత్సరం కాల వ్యవధి) కోర్సు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిషియన్స్ ( ఒక సంవత్సరం), ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ ( ఒక సంవత్సరం), బేసిక్ డిజైనర్ అండ్ వర్చ్యువల్ వెరిఫైర్-మెకానికల్ (రెండు సంవత్సరాలు), అడ్వాన్స్డ్ సీ.ఎన్.సీ మషీనింగ్ టెక్నీషియన్ (రెండు సంవత్సరాలు), మెకానిక్ ఎలెక్ట్రిక్ వెహికల్ (రెండు సంవత్సరాలు) కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ కోర్సులను పూర్తి చేసుకున్న వారికి వివిధ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందేందుకు ఈ అధునాతన కోర్సుల శిక్షణ దోహదపడుతుందని కలెక్టర్ సూచించారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులలో చేరేందుకు అర్హులని తెలిపారు. ప్రవేశాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు నిజామాబాద్ ప్రభుత్వ బాలుర(పాత) ఐ.టీ.ఐ, బోధన్ ప్రభుత్వ ఐ.టీ.ఐ, కమ్మర్పల్లి ప్రభుత్వ ఐ.టీ.ఐలో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఐ.టి.ఐ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
