Saturday, February 14, 2026

తెల్లకోటుకు పుట్టినిల్లు

ఒకే ఇంట్లో నలుగురు ఆడపిల్లలు వైద్య విద్యలోకి

స్ఫూర్తిమంతం..అక్కాచెల్లెళ్ల చదువుల ప్రస్థానం

కుమార్తెలతో తల్లిదండ్రులు రామచంద్రం, శారద దంపతులు.

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

కన్న తల్లి గొంతు క్యాన్సర్‌తో చనిపోయింది. తోడబుట్టిన అన్న అనారోగ్య సమస్యతో దూరమయ్యారు. ఆ సంఘటనలు ఆయన్ను కదిలించాయి. తన బిడ్డలను వైద్యులను చేయాలనే సంకల్పాన్ని మనసులో నాటాయి. నలుగురు ఆడపిల్లలు పుట్టినా నిరాశ చెందలేదు. ‘మిషన్‌ కుడుతూ ఇంతమందిని ఎలా పెంచిపోషిస్తావంటూ’ ఇరుగుపొరుగు, బంధువుల సూటిపోటి మాటలు బాధిస్తున్నా వెనకడుగు వేయలేదు. తన రెక్కల కష్టంతో భార్య సహకారంతో నలుగురినీ చదివించారు. పిల్లలూ నాన్న ఆశయాన్ని అర్థం చేసుకుని చదువులో పోటీపడ్డారు. ఇద్దరు వైద్య విద్య కొనసాగిస్తుండగా, మరో ఇద్దరు తాజాగా ఎంబీబీఎస్‌లో చేరి ‘మా ఇల్లు తెల్లకోటుకు పుట్టినిల్లు’ అని నిరూపించారు. నలుగురు అక్కాచెల్లెళ్లు సాగించిన చదువుల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి..ఇంకెన్నో కష్టనష్టాలున్నాయి. వాటిని ఎలా అధిగమించారో ఇటీవలే వైద్య విద్యలో ప్రవేశం పొందిన కవలలైన రోహిణి, రోషిణి వివరించారు.

‘మాది సిద్దిపేటలోని నర్సాపూర్‌ కాలనీ. అమ్మానాన్నలు కొంక రామచంద్రం (శేఖర్‌), శారద. నాన్న చిన్నప్పుడే దర్జీ వృత్తి చేపట్టి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అమ్మ కూడా పని చేర్చుకుని నాన్నకు చేదోడుగా నిలిచారు. మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. మమత, మాధురి, రోహిణి, రోషిణి. మేమిద్దరం (రోహిణి, రోషిణి) కవలలం. అమ్మానాన్న ఇద్దరూ వృత్తి నైపుణ్యంతో రెక్కల కష్టాన్ని నమ్ముకొని సంపాదించిన ఒక్కో రూపాయి పోగేసి మమ్మల్ని చదివించారు.*

‘మమత’తో మొదలు

తొలుత అక్క మమత నాన్న కలల్ని సాకారం చేసే సౌధానికి బలమైన పునాది వేసింది. కష్టపడి చదివింది. పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్‌ ఎక్కడ చదవాలనే ప్రశ్న తలెత్తింది. ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఫీజు రాయితీ ఇవ్వడంతో హైదరాబాద్‌లో ఇంటర్‌ చేరింది. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించింది. విజయవాడలో ఏడాది లాంగ్‌టర్మ్‌ శిక్షణ తీసుకుని నీట్‌లో ర్యాంకు సాధించింది. విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం పీజీకి సిద్ధమవుతోంది. గైనిక్‌ లేదా జనరల్‌ మెడిసిన్‌లో సీటు సాధించాలనేది లక్ష్యం. అక్క స్ఫూర్తితో చిన్నక్క మాధురి వైద్య వృత్తి చేపట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అక్క మాదిరిగానే హైదరాబద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చేరింది. అక్కడ చదివే సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తినా పట్టువదల్లేదు. తర్వాత ఏడాది పాటు లాంట్‌టర్మ్‌ శిక్షణ తీసుకుని ర్యాంకు సాధించింది. కన్వీనర్‌ కోటాలో కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతోంది. అక్కలు ఇచ్చిన ప్రోత్సాహంతో మేమిద్దరమూ వైద్య విద్యనే ఎంచుకోవాలనుకున్నాం. విజయవాడలో ఇంటర్‌ పూర్తిచేశాం. గత ఏడు నీట్‌ రాయగా నాకు (రోహిణి) ప్రైవేటు వైద్య కళాశాలలో సీటు వచ్చింది. రోషిణికి సీటు రాలేదు. ప్రైవేటు కళాశాలలో చేరితే ఫీజుల భారం ఎక్కువవుతుందనే భయం.చెల్లికి సీటు రాలేదనే బాధతో సీటు వదులుకున్నా మరింత కష్టపడి చదివి ఈ ఏడు మళ్లీ నీట్‌ రాశాం. ప్రస్తుతం ఇద్దరమూ జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాం’ అని రోహిణి, రోషిణి వివరించారు. చదువు, క్రమశిక్షణలో మా ముగ్గురికీ అక్క మమత మార్గదర్శకంగా, ఆదర్శంగా నిలిచారని వారు వివరించారు.*

‘నాన్నే’ మా హీరో

ఒకానొక సందర్భంలో మా దగ్గరి బంధువు ఒకాయన ‘డబ్బు ఉన్న వారికే వైద్య విద్యను అభ్యసించడం సాధ్యం కావడం లేదు. మీ వల్ల అవుతుందా’ అంటూ చేసిన వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయని, అలా ఎంతో మంది అన్న మాటలు కసి పెంచాయని ఆ నలుగురు అమ్మాయిలు తెలిపారు. ‘కొందరైతే ఆడపిల్లలకు అంత పెద్ద చదువులు అవసరమా, పెళ్లి చేసి బాధ్యత తీర్చుకో అంటూ అమ్మానాన్నకు ఉచిత సలహాలు ఇచ్చేవారు. మరికొందరు బంధువులు కించపరిచేలా మాట్లాడారు. చాలా బాధపడ్డాం. అప్పుడే మాలో పట్టుదల మరింత పెరిగింది. మా విజయానికి అదే నాంది అయిందేమో అనిపిస్తుంది. అమ్మానాన్నలూ వారి మాటలను లక్ష్య పెట్టలేదు. పైగా స్ఫూర్తి రగిలించారు. ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని ప్రేరణ కల్పించారు. ఆ ప్రోత్సాహమే నాన్న లక్ష్యాన్ని నెరవేర్చాలనే మా ఆశయానికి అణువణువునా ఆయువు పోసింది. కష్టపడుతూనే ఇష్టంగా మమ్మల్ని పెంచిన మా నాన్నే మాకు రియల్‌ హీరో. రాత్రింబవళ్లు శ్రమిస్తున్నా నీరసించకుండా, ఓర్పుతో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న అమ్మే మాకు దైవం’ అని ఆ నలుగురు అమ్మాయిలు వివరించారు.

తోడ్పాటు అందిస్తే మరింత సులువు

నలుగురినీ చదివించేందుకు అమ్మానాన్నలకు ఏటా రూ.6 లక్షల వరకు ఖర్చవుతోందని ఆ మొత్తాన్ని సమకూర్చేందుకు నాన్న ఎంతో ఇబ్బంది పడుతున్నారని నలుగురు సరస్వతీ పుత్రికలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సహకారం, తోడ్పాటు అందిస్తే సులువుగా లక్ష్యాన్ని చేరుతామని, సమాజానికీ అండగా నిలుస్తామన్నారు. అమ్మాయిలను ఎవరూ..ఎప్పుడూ చులకనగా చూడొద్దని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular