కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలోనూ ఏ ఒక్క ఇల్లూ మినహాయించబడకుండా ఇంటింటి సమగ్ర సర్వేను పూర్తి శ్రద్ధతో పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే కోసం హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ సందర్భంగా ఇళ్లకు అతికించిన స్టిక్కర్లపై నమోదు చేసిన వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే ఫారంలోని ప్రశ్నావళి ప్రకారం నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరిస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేశారు. ప్రతి కుటుంబంలోని ఒక్కో వ్యక్తి వారీగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్యూమరేటర్ కు సూచించారు. ఇప్పటివరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తయ్యింది, కుటుంబ వివరాల సేకరణ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? కొత్తగా గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా నిర్ణీత కోడ్ లను పొందుపరుస్తూ స్పష్టమైన సమాచారంతో దరఖాస్తు ఫారాలను పూరించాలని అన్నారు. ప్రతీ ఎన్యూమరేటర్ రోజుకు సగటున కనీసం 15 ఇళ్లను సందర్శిస్తూ సర్వే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ, సర్వే ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
