Saturday, February 14, 2026

లగచర్ల కేసులో మరో నలుగురి అరెస్ట్‌

25కు చేరిన నిందితుల సంఖ్య

వికారాబాద్‌ కలెక్టర్‌కు అదనపు భద్రత

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఈ నెల 11న అధికారులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
శనివారం మరో నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నీరటి రాఘవేందర్, మదరయ్య, బసప్ప, గోపాల్‌ ఉన్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో సహా అరెస్టయిన నిందితుల సంఖ్య 25కు చేరింది. కొడంగల్‌ నియోజకవర్గం పరిగి డీఎస్పీ కార్యాలయం పరిధిలోకి రావడంతో వారిని ఇక్కడికే తీసుకువచ్చి విచారణ చేపడుతున్నారు. కేసు విచారణ, శాంతిభద్రతల దృష్ట్యా పరిగికి మరో డీఎస్పీని ఎటాచ్‌ చేశారు. గత నెల వరకు ఇక్కడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించి డీఎస్పీగా పదోన్నతిపై వెళ్లిన ఎన్‌.శ్రీనివాస్‌ను ఎటాచ్‌ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

అదనపు డీజీపీ విచారణ

లగచర్ల ఘటనకు సంబంధించి రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌ శనివారం విచారణ చేపట్టారు. ఉదయం 9:15కు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయన 12:30 వరకు ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, వికారాబాద్, పరిగి డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, కరుణసాగర్‌రెడ్డి, అదనపు డీఎస్పీ శ్రీనివాస్, సీఐలతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో గంటన్నర పాటు సమావేశమయ్యారు. దాడి చేస్తారనే ఆలోచనే తన మదిలోకి రాలేదని, అందుకే పోలీసుల భద్రతకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని, ఇందులో పోలీసుల పాత్రను తప్పుపట్టాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జిల్లా నిఘా వర్గాలు సరైన రీతిలో అప్రమత్తం కాలేదంటూ మహేశ్‌ భగవత్‌ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. లగచర్ల ఘటన నేపథ్యంలో కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌కు పోలీసులు అదనపు భద్రత కల్పించారు. ప్రస్తుతం వన్‌ ప్లస్‌ వన్‌ భద్రత ఉండగా, టూ ప్లస్‌ టూ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకోగా, మరో ఇద్దరు గన్‌మెన్లు విధుల్లో చేరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular