మామునూర్ ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ద్రోణ హైదరాబాద్
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన మామునూర్ ఎయిర్ పోర్ట్ ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సోమవారం సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అడ్డంగా మారిన 150 కిలోమీటర్ల జీఎమ్మాఆర్ నిబంధనను ఉపసంహరించుకునేలా చేసేందుకు అనేక సమావేశాలు నిర్వహించి ఒప్పించినట్టు మంత్రి తెలిపారు. ఈ నెల 6వ తేదిన ఏవియేషన్, రెవెన్యూ అధికారులతో సమావేశమై ఎయిర్ పోర్ట్ కు కావాల్సిన 280.30 ఎకరాల భూమి లో 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి ఉన్నందున ఈ భూసేకరణపై అంచనాలు రూపొందించి కేబినెట్ లో ఆమోదం పొందేలా చేశామని తద్వారా 205 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాకు తెలిపారు.
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ గురించి దశాబ్ధాలుగా వింటున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం అదిగో మామునూర్, ఇదిగో మామునూర్ ఎయిర్ పోర్ట్ అంటూ ఊరించిందని కానీ ఒక్క ఇటుక వెయ్యలేదని ఆయన ఆరోపించారు. అట్లాంటి ఎయిర్ పోర్ట్ ను రాబోయే 8 నెలల కాలంలో ప్రారంభం చేయబోతున్నామని ఆయన చెప్పారు. మొదటి దశలో మామునూర్ ఎయిర్ పోర్ట్ ను స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, మాస్టర్ ప్లాన్ తయారీ, ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ చేసేందుకు 8 నెలల పూర్తవుతుందని చెప్పిన ఆయన రెండవ దశలో రోజంతా ఇంటర్ నేషనల్ విమానాలు (పెద్ద విమానాల-A320, B737) మరియు కార్గో విమానాల ఆపరేషన్ చేయడానికి రానున్న 1 సంవత్సరం 6 నెలల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన ప్రకటించారు. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఇచ్చిన జీఓ ను మీడియా ప్రతినిధులకు అందించారు. ఈ ఎయిర్ పోర్ట్ ను భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయి విమానశ్రయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు) ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు పెద్ద విమానాలను నడిపే విధంగా ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తామని చెప్పిన ఆయన.. రాబోయే రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టులకు వీలైనంత త్వరగా అనుమతులు సాధించి నిర్మాణం చేపడతామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించామని వారుకూడా సానుకూలంగా స్పందించారని మంత్రి గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ పదేండ్లలో సాధించని ఎయిర్ పోర్టులను నాలుగేండ్లలో సాధించి చూపిస్తామని మంత్రి తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ రహదారి అభివృద్ధి
హైదరాబాద్ – విజయవాడ (NH-65) విస్తరణ పనులు చేపట్టాలని నేను అడిగిన వెంటనే కేంద్రమంత్రివర్యులు నితిన్ గడ్కరీగారు 6 వరుసల ఎక్స్ ప్రెస్ హైవేను మంజూరీ చేశారని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రస్తుతం దానికి సంబంధించిన డి పి ఆర్ పూర్తయ్యే స్టేజీలో ఉందని, పూర్తయిన వెంటనే జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. దీంతో హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణం మరింత మెరుగవుతుందని, ప్రయాణ సమయం తగ్గుతుందని తద్వారా విమానాల్లో వెళ్లే ప్రయాణికులు సైతం రోడ్డు మార్గంలో వెళ్తారని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ – భూపాలపట్నం NH-163 పరిధిలో నిర్మిస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆగష్టు 2018లో శంకుస్థాపన చేశారని.. గత ప్రభుత్వంలో కేవలం 30 % పనులనను మాత్రమే పూర్తిచేశారని.. హైదరాబాద్ అభివృద్ధి చేసినమని చెప్పుకు తిరిగే బీఆర్ఎస్ నాయకులు నాలుగున్నరేండ్లలో ఉప్పల్ ఫ్లైఓవర్ ను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వర్షాలు పడి రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది చనిపోవడం, క్షతగాత్రులై ఇబ్బందులు పడుతుంటే నాలుగున్నరేండ్లు ఏం చేశారని ఆయన నిలదీశారు. మేం వచ్చిన తర్వాత పనులు చేయని సంస్థను ఫోర్ క్లోజ్ చేసి కొత్తగా పనులు ప్రారంభించామని ఇప్పటికే పది నెలల్లోనే 50% పనులను పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఉప్పల్ చౌరస్తా నుంచి CPRI (సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) నారపల్లి వరకు దాదాపు 5 కిలోమీటర్లు ఉన్న ఫ్లైఓర్ నిర్మాణంలో మేడిపల్లి నుంచి CPRI వరకు ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని ఆయన చెప్పారు. ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఫ్లైఓవర్ పూర్తి కావడానికి ఒకటిన్నర సంవత్సరం పడుతుంది చెప్పిన మంత్రి.. ఇప్పటి వరకు ఫ్లైఓవర్ క్రింద 4 వరుసల రహదారిని 2 కిలోమీటర్ల మేర రోడ్డు వేసి ప్రజలను ఇబ్బందుల నుంచి దూరం చేశామని చెప్పారు. ఇంకా బీటీ చేయాల్సి ఉందని. వచ్చే మార్చి నెలకల్లా సర్వీస్ రోడ్లను పూర్తి చేస్తాం. శ్రీశైలం ఏరియాలో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. కేంద్రం ఆమోదం తెలిపితే అద్భుతమైన జాతీయ రహదారి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు చత్రపతి శివాజీ మహారాజ్ ప్రయాణించిన రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
దక్షిణ భాగం రాష్ట్రమే నిర్మిస్తుంది
ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) ను 2017-18 లో ప్రారంభించారని, ఇప్పటిదాక ఒక్క పనిని కూడా మొదలు కాలేదని హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి సూపర్ గేమ్ ఛేంజర్ లాంటి ఆర్ఆర్ఆర్ ను నిర్లక్యం చేసినవారు రెండు వంతెనలు కట్టి మేమే హైదరాబాద్ నిర్మాతలమని చెప్పుకు తిరిగడం వారికే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. వారు పదేండ్లలో కేంద్రంతో మాకేం అని అన్న రీతిలో వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి వెనకబడ్డదని.. రాజకీయాల్లో ఈగోలకు తావులేదని ఆయన తేల్చిచెప్పారు. మనమంతా ప్రజల కోసం పనిచేస్తున్నామని జవాబుదారిగా ఉండాలని ఆయన చెప్పారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణం మొదట కేంద్రమే నిర్మిస్తుందని చెప్పారు. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం.. పూర్తిస్థాయిలో క్లారిటీ మరియు కమిట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో పనులు ఆలస్యం జరిగితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం జరుగుతుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం స్వయంగా నిర్మించాలనుకుంటున్నాం. ఈ రోడ్డును 6/8 లేన్స్ లో ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో (ఢిల్లీ – ముంబాయి ఎక్స్ ప్రెస్ వే, ముంబయి-నాగపూర్ ఎక్స్ ప్రెస్ వే, చెన్నై-కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ వే, గుజరాత్ స్టేట్ రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మించిన ప్రమాణాలతో RRR దక్షిణ భాగం నిర్మించిందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. RRR దక్షిణ భాగం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీకి, ఎయిర్ పోర్ట్ కు కనెక్టివిటీ కల్పిస్తుంది. దీంతో ఆయా ప్రాంతాలు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, లాజిస్టిక్, మ్యాన్ ఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి చెప్పారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తామని చెప్పిన ఆయన.. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్ మెంట్ అధ్యయనం మరియు ప్రతిపాదించడం కోసం స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక ఆఫీసర్స్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ మొదటి సమావేశం ఇప్పటికే పూర్తయ్యింది. అంతేకాదు, రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు చేశామని దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రెటరీ శ్రీమతి దాసరి హరిచందన, ఐఏఎస్ ను నియమించినట్టు మంత్రి తెలిపారు.
ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగ నిర్మాణానికి, డీపీఆర్ ప్రిపరేషన్, కోసం టెండర్లు పిలవడానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందులో టెక్నికల్ అడ్వైజరీ, ఫైనాన్షియల్ అడ్వైజరీలు ఉంటారని మంత్రి తెలిపారు. ఎంపిక చేసిన డీపీఆర్ కన్సల్టెంట్స్ ఫీల్డ్ సర్వే చేసి అలైన్ మెంట్ ను ప్రతిపాదిస్తారు.. ఇందులో ఎన్ని లేక్స్ ఉన్నాయి, ఎంత ఎత్తులో రోడ్డు నిర్మాణం చేయాలి, ఎంత ఫారెస్ట్ భూములు ఉన్నాయి, ఎంతమంది రైతుల నుంచి భూసేకరణ చేయాలి వంటి అంశాలను కులంకుషంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తారని తెలిపిన మంత్రి.. ఫైనాన్సియల్ అడ్వైజర్ రోడ్డు నిర్మాణానికి కావల్సిన నిధులను సమకూర్చుకోవడానికి వరల్డ్ బ్యాంకు, జైకా, ఏడిబీ (ఎషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు) మొదలైన ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
ఇక ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ఇప్పటి వరకు 94% భూసేకరణ పూర్తి చేశామని.. వాస్తవానికి 80% భూసేకరణ పూర్తయితే టెండర్లు పిలవవచ్చు కానీ.. NHAI ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదు మరియు భూసేకరణకు సంబంధించిన పరిహారం ఇంకా ఫైనల్ చేయలేదని ఆయన తెలిపారు. భూసేకరణ పరిహారం విషయంలో రైతులకు నష్టం జరగకుండా.. మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా ప్రయత్నిస్తున్నాం.రైతులు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో NHAI కి పూర్తి సమాచారం, సహకారం అందిస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణం ఇక వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కొరకు 1895 హెక్టార్ల భూమి సేకరణ చేయవలసి ఉండగా ఇప్పటిదాక 1862 హెక్టార్ల భూమి కొరకు 3 (D) నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 1320 హెక్టార్లకు డ్రాఫ్ట్ అవార్డుల ప్రిపరేషన్ జరిగింది. మరియు 427 హెక్టార్ల భూమికి అవార్డు ఎంక్వైరీ జరుగుతున్నది. 94 హెక్టార్ల భూమి వివిధ దశల్లో కోర్టు కేసుల్లో ఉంది. ఇవన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి NHAI కి అప్పగిస్తమని మంత్రి తెలిపారు.
మాది అభివృద్ధి – వాళ్లది ఫక్తూ రాజకీయం
మేం తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలో అని ప్రణాళికలు వేసుకొని ప్రయత్నాలు చేస్తుంటే.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతీదాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రేపు వరంగల్ జిల్లా పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దాదాపు 4 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.
కలెక్టర్ పై దాడి గురించి విలేకర్లు అడిగిన ప్రశ్న కు బదులిస్తూ రైతుల ముసుగులో బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కలెక్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు. ఇలానే దాడి చేస్తే అనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేవాళ్ళా అని ప్రశ్నించారు. రేప్ కేసులో ఉన్న రౌడీ BRS పార్టీ కార్యకర్తలు ఐఏఎస్ పై దాడులు చేస్తుంటే.. ఖండించాల్సింది పోయి మా కార్యకర్తేనని సిగ్గులేకుండా కేటీఆర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడని మండిపడ్డారు. అరెస్టుల చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తోందని మాది అంబేద్కర్ రచించిన రాజ్యంగం ఫాలో అయ్యే పార్టీ అని అందుకే ప్రతీది చట్ట ప్రకారం జరుగుతుందని తెలిపారు. వారిది కేసిఆర్ రాజ్యాంగమని అందులో న్యాయం, ధర్మం, చట్టం ఉండదని.. వాళ్లకు నచ్చకపోతే జైలుకు పోయే పరిస్థితులను మనం కళ్లారా చూసామని ఆయన చెప్పారు. నేను ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నపుడు కేసీఆర్ నన్ను అనేకసార్లు హౌస్ అరెస్టు చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రజలు పదవులు ఇచ్చింది ఢిల్లీలో ఉండి రాష్ట్రానికి మేలు చేయడానికా? గల్లీలో ఉండదానికా? అని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కి దమ్ముంటే నల్గొండలో మూడు నెలలు పడుకొని కాళ్ళు చేతులు వంకలు కాకుండా హైదరాబాద్ వాస్తరా అని ఛాలెంజ్ చేశారు? కిషన్ రెడ్డికి ఢిల్లీలో దోమల భాధకు తట్టుకోలేక హైదరాబాద్ లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. బాషీర్ భాగ్ లో రైతుల పై చంద్రబాబుతో కలిసి కేసీఆర్ కాల్పులు జరిపించి ఇప్పుడు రైతులపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని ఆయన ఆరోపించారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ మూసీ శుద్ధీకరణ వద్దు ప్రకటన చేయగలరా అని ప్రశ్నించారు.
తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన మంత్రి
అనంతరం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డిసెంబర్ మొదటి వారంలో పనులు పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. లక్షలమంది సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కారిస్తామని చెప్పిన మంత్రి తెలంగాణ ప్రజల బాగుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పారు. వారి ఆశీర్వాదం ఉంటే ఏ పక్షం కాంగ్రెస్ పార్టీ ని ఏం చేయలేవని వచ్చే ఇరవై ఏండ్లు కాంగ్రెస్ పార్టీదేనని తేల్చిచెప్పారు. అనంతరం నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా ఉండేలా నిత్యం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
