అసెంబ్లీలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి
ప్రకాష్ రెడ్డి సోదరులు 15కోట్ల కోసం జాకీని వెళ్లగొట్టారు
10వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను మళ్లీ తీసుకురావాలి
పరిటాల శ్రీరామ్ తో కలసి మంత్రులకు వినతి పత్రం అందజేసిన పరిటాల సునీత
ద్రోణ అమరావతి ప్రతినిధి
రాప్తాడు నియోజకవర్గ ప్రజల వాణిని మరోసారి ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో వినిపించారు. బుధవారం అసెంబ్లీలో జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిన అంశం గురించి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వలన జాకీ సంస్థ రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా ఉత్తర్వులు ఇచ్చినట్టు గుర్తు చేశారు. 129 కోట్లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల దుస్తులను తయారు చేసే పరిశ్రమ పనులు కూడా 2018లో ప్రారంభించారన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి మిషనరీలను కూడా తీసుకొచ్చిన సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆసమయంలో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అతని సోదరులు పరిశ్రమ యాజమాన్యం నుంచి 15కోట్లు డిమాండ్ చేశారన్నారు. దీంతో పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందన్నారు. ఈ పరిశ్రమ వలన సుమారు 6వేల మందికి ప్రత్యక్షంగా 4వేల మందికి పరోక్షంగా మొత్తం 10వేల మంది ఉపాధి కల్పించే అవకాశాన్ని కోల్పోయామన్నారు. జాకీ పరిశ్రమ మళ్లీ ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీతో పాటు సీపీఐ నాయకులు కూడా చలో జాకీ పరిశ్రమ కార్యక్రమాన్ని నిర్వహిస్తే పోలీసులు చేత అక్రమంగా అరెస్టులు చేయించారన్నారు. ప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతో 40మంది టీడీపీ, సీపీఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించారన్నారు. ఇందులో నాతో పాటు పరిటాల శ్రీరామ్, సీపీఐ రామకృష్ణలు కూడా ఉన్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్ని ప్రయత్నాలు చేసిన జాకీని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోగా వేరే గార్మెంట్స్ పరిశ్రమలు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. కానీ నేటికీ ఆ భూముల్లో ఒక్క పరిశ్రమ కూడా రాని కారణంగా వృథాగా ఉన్నాయన్నారు. అందుకే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన ప్రోత్సాహాకాలు కొనసాగిస్తూ జాకీ పరిశ్రమ తిరిగి వచ్చేలా చూడాలన్నారు. ప్రస్తుతం రాప్తాడు సమీపంలో విలువైన భూములు అందుబాటులో ఉన్నాయని.. ఆ స్థానంలో జాకీ పరిశ్రమ వస్తే 10వేల మందికి ఉపాధి కల్గుతుందన్నారు. జాకీ పరిశ్రమ రాని పక్షంలో మరేవైనా ఇలాంటి పరిశ్రమలే తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. సభ అనంతరం స్పీకర్ ఛాంబర్లో పరిటాల శ్రీరామ్ తో కలసి భారీ, చిన్న తరహా పరిశ్రమల శాఖల మంత్రులు టి.జి. భరత్, కొండపల్లి శ్రీనివాస్ కు జాకీ పరిశ్రమను తిరిగి రప్పించాలని పరిటాల సునీత వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై మంత్రులు స్పందిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొనివెల్లి పరిశ్రమలు నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
