Saturday, February 14, 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం

జగిత్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్

అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదు- ఎమ్మెల్సీ కవిత

పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ ను ప్రజలు క్షమించరు

జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ కవిత

బీసీ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం.. రేపు ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్ కు రిపోర్ట్ అందజేయనున్న ఎమ్మెల్సీ కవిత

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

భారత దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన వ్యక్తులను ప్రజలు క్షమించరని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసారు. బంజారాహిల్స్ లోని నివాసంలో జగిత్యాల నియోజకవర్గ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు.
సోమవారం ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్ కు రిపోర్ట్ అందజేయనున్న నేపథ్యంలో, బీసీ సంఘాల నాయకులతోనూ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు.

జగిత్యాలతో ఆత్మీయ అనుబంధం

జగిత్యాలకు, నాకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత 2014 లో నిజమాబాద్ ఎంపీగా తాను గెలిచినా, జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఓడిపోయారని, కానీ పార్టీలకు అతీతంగా, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, అభివృద్ధిలో జగిత్యాల వెనకబడొద్దు అనే ఆదేశాలను కేసీఆర్ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలి, చిన్న జిల్లాల ద్వారానే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో ఉన్న ప్రతి పేద వ్యక్తికి కూడా తెలంగాణ సాధించిన ఫలితం అందుతుందని కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రోజుల్లోనే చెప్పేవారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్, జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు, హైదరాబాద్ తరువాత ఎక్కువ సంఖ్యలో, 4,500 డబుల్ బెడ్ రూం ఇండ్లు జగిత్యాలకే కేటాయించి ప్రత్యేక శ్రద్ద చూపెట్టారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

నాయకులు పార్టీ మారినా.. కార్యకర్తలు పార్టీతోనే

ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్, అప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా, పార్టీ ప్రతి కార్యక్రమంలో వేదిక పైకి తీసుకొచ్చి, కాబోయే ఎమ్మెల్యే అంటూ ఐదు సంవత్పరాల పాటు ప్రతి గ్రామంలో చెప్పామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఓడిపోయినా వదిలేయకుండా గౌరవంగా చూసుకుంటామనే సందేశం ఇచ్చిన సభ్యత గల పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఆనాడు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి ఎన్ని ఆకృత్యాలు, ఆఘాయిత్యాలు చేసినా, బీఆర్ఎస్ కార్యకర్తలంతా ముందుండి కొట్లాడారు కాబట్టే, జగిత్యాలలో గులాబీ జెండా ఎగిరిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నాయకులు పార్టీలు మారినా, కార్యకర్తలు పార్టీలోనే ఉంటారని చెప్పడానికి మంచి ఉదాహరణ జగిత్యాల నియోజకవర్గం అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

పార్టీ మారిన వ్యక్తులను ప్రజలకు క్షమించరు

ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మారిపోయినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తే అర్థముండేదని, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా గోడ మీద పిల్లిలాగ ఉండటం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం లాంటిదని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తులను ప్రజలు క్షమించరని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసారు. ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకోవడం పిరికితనమని, అలాంటి నాయకులు బీఆర్ఎస్ కు అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసారు. గులాబీ జెండా అంటేనే గుండె ధైర్యం, గులాబీ జెండా అంటేనే ఉద్యమ పిడికిలి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పిరికివాళ్లు, పదవుల వ్యామోహం ఉన్న వాళ్లు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదన్నారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, పార్టీ నుండి కార్యకర్తలకు, స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్యే పార్టీ మారారనే అంశంతో సంబంధం లేకుండా గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

పది నెలల్లోనే ప్రజా వ్యతిరేకత

భారత దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఒక్క పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతోందని, వాళ్లు ఎన్నికల్లొ ఇచ్చిన హామీలను ఇంకా ప్రారంభించలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.

సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం

ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూప్ లు, సోషల్ మీడియా సిద్దం చేసుకోవాలని, కేసీఆర్ హయంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
కరెంటు కోతలు, రైతు భరోసా, మహిళలకు నెలకు రూ. 2,500 ఇవ్వకుండా ఎలా మోసం చేసారనే అంశాలను ఇప్పటినుండే చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలను తీసుకొని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాలలో మెజారిటీ సీట్లు గెలిచేవిధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని ఎమ్మెల్సీ కవిత పార్టీ నేతలకు సూచించారు.

నీ కోసం తపించిన బిడ్డ కష్టాల్లో ఉండి, జైల్లో ఉన్నప్పుడు పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,రాజకీయాలకు మచ్చ తెచ్చారని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు, జెడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్, స్థానిక నేతలు పాల్గొన్నారు.

బీసీ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం

బీసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి మరియు బీసీ కుల సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్ కు ఎమ్మెల్సీ కవిత రిపోర్ట్ అందజేయనున్నారు. జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బీసీ నేతలు గట్టు రాంచందర్ రావు, బొల్లా శివ శంకర్ , ఆలకుంట హరి, ఉపేందర్, మఠం భిక్షపతి, రాజారాం యాదవ్, దావ సురేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular