సరస్వతి క్షేత్రం చుట్టూ బోలెడు వింతలు
రోజురోజుకూ పెరుగుతున్న సందర్శకులు
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-
బాసరక్షేత్రాన్ని సరస్వతి క్షేత్రంగానే భావిస్తుంటారు. కానీ బాసర సరస్వతి క్షేత్రం ముందు పంచలింగాల క్షేత్రమని శివపురాణంలో పేర్కొనబడింది. బాసరలో గోదావరినది ఒడ్డున సురేశ్వరాలయం, పాపహరేశ్వరాలయం, పాపాలేశ్వరాలయం, ఓటేశ్వరాలయం, కుక్కుటేశ్వ రాలయాలతోపాటు బీరప్ప (శివాలయం) పురాతన ఆలయాలు సైతం ఉన్నాయి. బీరప్ప దేవాలయం వెయ్యి ఎండ్లకు పైగా పురాతన ఆలయంగా ప్రసిద్ధి. పాపహరేశ్వరాలయం 600 ఏండ్ల పురాతన ఆలయాలుగా ప్రసిద్ధి కాలగర్భంలో ఓటేశ్వరాలయం, కుక్కుటేశ్వరాలయాలు కలిసిపోయాయి. శిథిలావస్థలో ఆలయాలు ఉండడంతో వీటిపై దేవాదాయశాఖ దృష్టి సారించి పురావస్తుశాఖ అధికారులతో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అపూర్వం ఆలయం…
బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి దాదాపు రెండు కిలో మీటర్ల దూరంలో పాపహరేశ్వరాలయం ఉంటుంది. కొండప్రాంతంలోని ఈ పురాతన శివాలయం. బాసర క్షేత్ర చరిత్రకు అనవాలుగా మిగిలింది. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం అద్భుత శిల్పకళకు నెలవు పాక్షికంగా పై భాగంలో దెబ్బతిన్న ఆలయంలో శిలాస్తంభాలు, విగ్రహాలు, పాత్రలు, శిలా మండపాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. ఆలయ ప్రాంగ ణంలో గత కొనేరు మధ్యలో ఎత్తయిన శిలాస్తంభం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ స్తంభంపై దీపాలు పెట్టి దాని ఆధారంగా ప్రజలు రాత్రిపూట గ్రామాలకు చేరేవారని చెప్పుకుంటారు. ఇలాంటి అపూర్వ ఆలయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత దేవాదాయ, పురావస్తుశాఖ అధికా రులపైఉంది.
ఆలయ రక్షకుడు మక్కా జి పటేల్...

రజాకార్ల హయాంలో సరస్వతి ఆలయంపై దాడికి ప్రయత్న జరిగింది. అప్పట్లో హిందు ఆలయాలపై దాడులు చేసి, దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసంచేసి నగలు, కానుకలను దోచుకునేవారు. అప్పటి రేణుకాపూర్ (ప్రస్తుతం బాసర గ్రామ పంచాయతీలో విలీనమైన గ్రామం) పట్వారీగా ఉన్న మక్కాజి పటేల్ అమ్మవారి ఆలయంపై రజాకార్ల దాడిని ముందే పసిగట్టాడని… చుట్టు పక్కల గ్రామాల ప్రజలను, యువకులను అప్రమత్తం చేశారని… దుండగులను ఎదురించి అమ్మవారి ఆలయాన్ని రక్షించాడని ఇక్కడివారు చెబుతారు. అందుకే మక్కాజి పటేల్ విగ్రహాన్ని ఆలయంలో నెలకొల్పారని చరిత్ర చెబుతోంది. అమ్మవారిని దర్శించుకొని ప్రధాన ఆలయ ద్వారం నుంచి బయటకు రాగానే ఎడమవైపు గోడకు నిల బెట్టిన ఆయన శిలావిగ్రహం కనిపిస్తుంది.

భూగర్భ గుహలు
ఇప్పటివరకు వెలుగులోకి రాని మరో వింత భూగర్భ గుహలు. పాపహారేశ్వర ఆలయం, దానికి ఆరు కిలోమీటర్ల దూరంలో గల దత్తాత్రేయ మందిరం వద్ద గల గుహలు చూడవచ్చు. లోపలికి ప్రవేశించేందుకు వీలుగా చిన్న ద్వారం ఉంటుంది. లోపల ఎంతదూరం ఉందో అంతుచిక్కదు. చీకటిగా ఉండడం వల్ల లోనికి వెళ్లలేని పరిస్థితి. వీటిని భూగర్భ మార్గాలుగా చెబుతుంటారు. పుణ్యక్షేత్రంలో ఇదో మిస్టరీగా మిగిలిపోయింది..

వ్యాసగుహ..
బాసర వ్యాసముని తపస్సు చేసి సరస్వతిదేవిని ఆరాదించినట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని కొండపై గల పెద్ద గుహ వ్యాసముని తపస్సుచేసిన ప్రదేశంగా భావిస్తారు. ఈ తపస్సు అనంతరమే ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతుంటారు. బాసర వచ్చే యాత్రికుల్లో చాలామంది ఈ గుహలను తప్పక దర్శించుకుంటారు.
