Friday, February 13, 2026

కాసుల వేటలో… రిజిస్ట్రారు శాఖ


* ఆగని అవినీతి*
*దస్తావేజుకు 10వేల చొప్పున డిమాండ్
*ఏసీబీ వలకు చిక్కిన సబ్ రిజిస్ట్రార్, స్వీపర్

నిజామాబాద్ (ద్రోణ ప్రతినిధి ):- ఆదాయంపై దృష్టి పెడుతున్న రిజిస్ట్రేషన్ అధికారులు తరచూ ఏసీబీ కేసుల పాలవుతూ కటకటాల వెనక్కి వెళ్తున్నారు. ఓవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవగా, దస్తావేజుల రిజిస్ట్రెషన్ లను అమాంతంగా పడిపోయాయి. మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల వసూళ్ల దందా తారాస్థాయికి చేరింది. లంచం డిమాండ్ చేసిన ఓ సబ్ రిజిస్ట్రార్ తో పాటు సహకరించిన స్వీపర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. పాలక ప్రభుత్వాలు తీసుకువచ్చిన కొత్త నిబంధనలు రియల్ వ్యాపారానికి బుద్ది పండగ మారాయి. ఈ నిబంధనల ఫలితంగా అనేకమంది ఉపాధి కోల్పోతుండగా, వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల అవినీతి మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది. ఒక్కో దస్తావేజుకు ధర నిర్ణయించి మరి లంచాలు స్వీకరించడం షరా మామూలుగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం రచ్చకెక్కింది. సబ్ రిజిస్ట్రార్ ల అవినీతి బాగోతాన్ని తట్టుకోలేక డాక్యుమెంట్ రైటర్లు నిరసనలు వ్యక్తం చేయాల్సి వచ్చింది. గతంలో డాక్యుమెంట్ రైటర్లు ఈ వసూళ్ల దందాను నిలిపి వేయించాలని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ లంచావతారాలు తమ బుద్ధి మార్చుకోలేదు. దస్తావేజుకు పదివేల చొప్పున ముక్కు పిండి వసూలు చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే ఓ వ్యక్తి తన ఓపెన్ ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయాలని నిజామాబాద్ అర్బన్ జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ చెన్నమధవని శ్రీరామరాజు ను సంప్రదించగా, 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. తన కార్యాలయంలో స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న రంగ్ సింగ్ వెంకట్ రాజుకు ఆ లంచం డబ్బులు ముట్ట చెప్పాలని హుకూం జారీ చేశాడు. దీంతో ఆవేదనకు గురైన బాధితుడు నిజామాబాద్ రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు అధికారులు బాధితుని నుంచి ఫిర్యాదు స్వీకరించి, సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేసి బాధితుడి నుంచి స్వీపర్ రంగ్ సింగ్ వెంకట్ రాజు 10 వేల రూపాయల లంచం స్వీకరించగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం జాయింట్ – 2 సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజుతో పాటు స్వీపర్ రంగ్ సింగ్ వెంకటరాజుపై కేసు నమోదు చేసారు. ఇరువురు నిందితులను నాంపల్లి రెండవ అదనపు స్పెషల్ జడ్జ్ ఏసీబీ కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని కోరారు. లంచం ఇవ్వడంతో పాటు స్వీకరించడం చట్టరీత్యా నేరమని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular