ఓల్డ్ సిటికి ముఖ్యమంత్రివా, ప్రశ్నించిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్(ద్రోణ ప్రతినిధి) :- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలను నడిపిస్తున్నారని విమర్శించారు. ఎస్ ఎల్ బి సి ఘటన, శాంతి భద్రతల సమస్య, ప్రజా తిరుగుబాటు, బీజేపీ ఎదుగుదల, ఇవన్నీ ఓర్చుకోలేక కిషన్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి కృషి వల్లే మామూనూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, రామగుండం ఎరువుల పునరుద్దరణ, సమ్మక్క,సరళమ్మ ట్రైబల్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు అందించిందని స్పష్టం చేశారు. బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యేలు, ఎనిమిది ఎంపీలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులకు బీజేపీ అడ్డుపడిందా, రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికినవారు బీజేపీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను చిన్నచూపు చూస్తూ, ఓటు బ్యాంకు కోసం మతపరమైన ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.
రంజాన్ సందర్భంగా 10వ ప్రీఫైనల్ పరీక్షల షెడ్యూల్ మారుస్తావా మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలను ఇబ్బంది పెట్టేలా టైం టేబుల్ మార్చడం ఏంటి అని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి హిందువుల ఓట్ల కోసం దేవతల మీద ప్రమాణం చేసి గెలిచాక, ఓ వర్గానికి జీ హుజుర్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమియతే ఇస్లామిక్ నిషేధిత సంస్థల కార్యక్రమాలకు ప్రభుత్వ ధనం ఖర్చు చేయడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చే సమయం దగ్గర్లోనే ఉంది అని హెచ్చరించారు. బీజేపీ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది. రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
