Friday, February 13, 2026

ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల చొరవ

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

25 శాతం రిబేటు సదుపాయాన్ని వినియోగించుకోవాలని హితవు

నిజామాబాద్ ( ద్రోణ) ప్రతినిధి:- జిల్లాలో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్.ఆర్.ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల మార్చి 31 లోపు పూర్తి స్థాయి ఎల్.ఆర్.ఎస్ ఫీజుతో పాటు ప్రో-రాటా ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు వర్తింపజేస్తోందని గుర్తు చేశారు. దీంతో దరఖాస్తుదారులు ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు స్వతహాగా ముందుకు వస్తున్నారని అన్నారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు రిబేటును మినహాయిస్తూ, వెంటదివెంట ల్యాండ్ రెగ్యులరైజెషన్ కు సంబంధించిన ప్రొసీడింగ్ లు జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 190 మంది ఎల్.ఆర్.ఎస్ ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకున్నారని తెలిపారు. ఇందులో రిబేట్ ప్రకటించిన తరువాత 65 మంది ఫీజు చెల్లించారని, మంగళవారం ఒక్క రోజే 15 మంది దరఖాస్తుదారులు తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకున్నారని వివరించారు. అదేవిధంగా భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో 26 మంది, బోధన్ లో 104 మంది ఎల్.ఆర్.ఎస్ ఫీజు చెల్లించారని తెలిపారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటివరకు 895 మంది ఫీజు చెల్లింపులు పూర్తి చేశారని, ఎల్.ఆర్.ఎస్ కింద రూపాయలు 12.45 కోట్ల రుసుము వసూలయ్యిందని కలెక్టర్ వివరించారు. మిగితా దరఖాస్తుదారులు కూడా నిర్ణీత గడువు లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి తమ ప్లాట్ల క్రమబద్దీకరణ చేసుకోవాలని, రిబేటు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ది పొందాలని హితవు పలికారు. దరఖాస్తుదారుల సౌకర్యార్ధం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయించామని, దరఖాస్తుదారులు సంప్రదించవచ్చని సూచించారు. బఫర్, ఎఫ్.టి.ఎల్, చెరువులు, కుంటలు వంటి నిషేధిత జాబితాలోని ప్రాంతాలను మినహాయిస్తే, ఇతర ప్రాంతాలలోని ప్లాట్లకు ఆన్లైన్ లో సులభంగా అనుమతి లభిస్తోందని అన్నారు. చెరువులు, నీటి వనరులకు సమీపంలో కనీసం 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అనుమతులు తప్పనిసరి అని కలెక్టర్ వెల్లడించారు. ఎల్ ఆర్ ఎస్ అర్హత లేని స్థలాలపై చెల్లించిన ఫీజులలో 90% రిఫండ్ అవుతుందని, 10 శాతం ప్రాసెసింగ్ చార్జెస్ కింద తీసుకుంటారని అన్నారు ‌. స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించిన వారికి అర్హత ఉంటే స్థల క్రమబద్ధీకరణ చేసి సంబంధిత ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్నామని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ అనుమతులు లేని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబడవని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమ బద్దీకరణ చేసుకోవాలని, మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రిబేటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 25 శాతం రాయితీ పొందాలని కలెక్టర్ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular