నిజామాబాద్ టౌన్ ప్రతినిధి ద్రోణ:-
నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో భారీగా వసూళ్లు జరుగుతున్న ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏజెంట్ల ద్వారా నిత్యం పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు బయట పెట్టారు. కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏజెంట్ ఎండీ ఖలీల్ నుంచి రూ.27వేల లెక్కచూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి వద్ద నుంచి 14 వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పత్రాలను, ముగ్గురు వ్యక్తుల తాలూకా డ్రైవింగ్ లైసెన్స్లను జప్తు చేశారు. అయితే అధికారులు, సిబ్బంది ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయమై ఏసీబీ అధికారులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
కోడ్ భాషలో వసూళ్లు..
రవాణా శాఖ కార్యాలయంలో అధికారులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా అన్ని రకాల కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారి ద్వారా జరిగే ఏ పనికైనా ఒకే రేటు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక్యంగా కోడ్ భాషను సంబంధిత పత్రాలలో రాస్తున్నట్లు ఏసీబీ తనిఖీలో బయటపడింది. ప్రస్తుతానికి ఏజెంట్ ఖలీల్ నుంచి నగదుతో పాటు పత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ తదుపరి విచారణను చేపట్టింది. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అనిశా అధికారిక ప్రకటనలో పేర్కొంది. నివేదిక ఆధారంగా రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులపై కేసు నమోదు చేయడమా.. లేదా శాఖ పరమైన చర్యలు తీసుకోవడమా అనేది స్పష్టత రానుంది. కాగా.. ఏసీబీ సోదాల నేపథ్యంలో రవాణా శాఖ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. నిత్యం ఆఫీసు వేళల్లో రద్దీగా కనిపించే కార్యాలయం.. ఏసీబీ దాడులతో బోసిపోయింది.
