డిచ్పల్లి ద్రోణ:-
తెలంగాణ విశ్వవిద్యాలయంలో కేంద్రియ ఔషధ సుగంధ ద్రవ్య మొక్కల పరిశోధన కేంద్రం (సి -మ్యాప్) హైదరాబాద్ ఆధ్వర్యంలో ఔషధ, సుగంధ మొక్కలు మరియు వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ యాదగిరిరావు మాట్లాడుతూ భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముకని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతతో ముందుకు వెళ్లాలంటే వ్యవసాయ రంగంలో ఔషధ మరియు సుగంధ ద్రవ్య పంటలను వాణిజ్య పంటలుగా అభివృద్ధి చేయాలన్నారు.వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో నూతన వినూత్న మార్పులను ఆవిష్కరిస్తూ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను తగ్గిస్తూ సుగంధ ద్రవ్యాలు, వాణిజ్య పంటలను ప్రోత్సహించాలని తెలిపారు.
రైతులు ఉత్పత్తిని గణనీయంగా పెంచి వాణిజ్య పంటల ఎగుమతిలో అంతర్జాతీయంగా భారతదేశానికి కీలకమైన స్థానంలో నిలబెట్టాలన్నారు.సుగంధ ద్రవ్యాల సాగులో అధిక ఆదాయంతో పాటు సులభతరమైన మార్కెట్ సౌకర్యం కలిగి ఉన్నదని పేర్కొన్నారు.
ఔషధ వాణిజ్య పంటల సాగు చీడపీడలకు దూరంగా ఉంటుందని, నీటి వినియోగం తక్కువుగా ఉంటుందని, క్రిమి కీటకాలు ఆశించవని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. జ్ఞానేష్ ఎసి మాట్లాడుతూ ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు వలన రైతులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఔషధ మరియు సుగంధ మొక్కల సాగుతో పంటలకు తెగుళ్లు మరియు వ్యాధులకు గురికాకుండా నివారించవచ్చునన్నారు.
ఈ సాగులో రైతులు పండించిన ఉత్పత్తికి పరిశ్రమలతో అనుసంధానించడానికి ప్రతిభావంతమైన మార్కెటింగ్ మరియు సరఫరా గొలుసు నిర్వహణ కలిగి ఉందని పేర్కొన్నారు.ఈ సాగుతో అంతర్జాతీయ ఎగుమతులు పెరిగి దేశాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉన్నత్ భారత్ అభియాన్ ప్రాజెక్ట్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ సమన్వయకర్తగా వ్యవహరించినారు.ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండలం నుండి వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు హాజరై శాస్త్రవేత్తలతో అనేక వ్యవసాయ రంగ ఉత్పత్తులకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకొని నిమ్మ గడ్డి మరియు కాషా గడ్డి మొక్కలను తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సహ సమన్వయకర్తలుగా డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ శిరీష బోయపాటి, డాక్టర్ ఏ పున్నయ్య, డా. నాగరాజు, డా. నాగరాజు పాత,డాక్టర్ సాయిలు,డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ నరసయ్య, డాక్టర్ శరత్ ఆచార్య అపర్ణ, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ మహేంద్ర ఐలేని సీనియర్ టెక్నీషియన్ వై వి వి ఎస్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
