200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్
20 ఎకరాల స్థలం పి ఎస్ ఆర్ నగర్ లో పాఠశాల
సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
ద్రోణ బోధన్ ప్రతినిధి
మండలాల విభజనతో ప్రజలకు ప్రజా సౌలభ్యం కలిగించేందుకు కోటగిరి మండలాన్ని రెండు మండలాలుగా విభజించారు. మేజర్ గ్రామపంచాయతీ అయినటువంటి పోతంగల్ గ్రామాన్ని నూతన మండలం గా ఏర్పాటుచేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజా మన్నాను పొందారు. నూతన మండలాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి అభివృద్ధిని కూడా పోచారం తన భుజస్కందాలపై ఎత్తుకొని మోస్తున్నారు. పోతంగల్ మండల అభివృద్ధి లక్ష్యంగా ఎంచుకున్న మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పొతంగల్ మండలంలోని గ్రామాలను ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నారు. పోతంగల్ మండలం పరిధిలోని రామ్ గంగానగర్ గ్రామ శివారులో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేయించారు. ఈ పాఠశాల ఏర్పాటుతో పోతంగల్ మండలానికి తల మానికంగా భావించవచ్చు. బాన్సువాడ నియోజకవర్గానికి ఒకే ఒక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరైనప్పటికీ పోతంగల్ మండలాన్ని సైతం అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాల ఏర్పాటుకు 200 కోట్లు నిధులు కూడా మంజూరైనట్లు అధికారిక పత్రాలను మంగళవారం విడుదల చేశారు. ఈ పాఠశాల ఏర్పాటుతో మండలంలో పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా ఉండే పోతంగల్ మండలం అభివృద్ధి బాటలో నడిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. గ్రామపంచాయతీ పరిధిలోని రామ్ గంగానగర్ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆయన తనయుడు పోచారం సురేందర్ రెడ్డి పేదవారికి డబల్ బెడ్ రూములు నిర్మించి అప్పగించారు. గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి చేశారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎంతో నష్టాలు చవిచూసినప్పటికీ పోచారం తనయుడు పేదల అభివృద్ధి లక్ష్యంగా భావించి గృహాలను నిర్మించడం జరిగింది. రామ్ గంగానగర్ గ్రామ ప్రజలు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరుని ఆ గ్రామ పేరుగా మార్చుకున్నారు. అదే గ్రామం నేడు పిఎస్ఆర్ నగర్ గా చలామణి అవుతుంది. అటువంటి పీఎస్ ఆర్ నగర్ లోనే ఇటువంటి బృహత్తర పాఠశాల ఏర్పాటు కావడం పట్ల ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.బాన్సువాడ నియోజక వర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి పోచారం శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
