Thursday, February 12, 2026

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల పై నిరంతర పర్యవేక్షణ

ద్రోణ నిజామాబాద్, జూలై 08

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో లక్ష్యాల సాధన కోసం నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన బోధన్ మున్సిపాలిటీని సందర్శించారు. పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్ ల జారీ తదితర అంశాలపై బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తో కలిసి అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో వార్డు వారీగా ఆయా కార్యక్రమాల అమలు తీరును, సాధించిన ప్రగతిని సమీక్షిస్తూ, అధికారులకు సూచనలు చేశారు. పేదలకు సొంత ఇంటిని సమకూర్చాలని ప్రభుత్వం ఉదాత్తమైన ఆశయంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అలసత్వానికి తావులేకుండా లక్ష్య సాధన కోసం అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. ఇల్లు మంజూరైన లబ్దిదారులు అందరూ తప్పనిసరిగా ఇళ్ళను నిర్మించుకునేలా చూడాలన్నారు. నిర్మాణ పనులు చేపట్టే విషయంలో లబ్దిదారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, లబ్దిదారులకు అవసరమైన తోడ్పాటును అందించాలని వార్డు అధికారులను ఆదేశించారు. ఆర్ధిక స్థోమత లేని వారికి మెప్మా ద్వారా రుణాలు ఇప్పించాలని, వాటిని ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల కోసం వినియోగించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి ఇళ్ళ నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. చిత్తశుద్ధితో కృషిచేస్తూ, లబ్దిదారులకు ప్రోత్సాహం అందిస్తే తప్పనిసరిగా వారు ఇల్లు నిర్మాణం కోసం ముందుకు వస్తారని సూచించారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి దశల వారీగా రూ. ఐదు లక్షల ఆర్ధిక సహాయం అందిస్తోందని, అంతేకాకుండా ఉచితంగా ఇసుక సరఫరా, డ్వాక్రా, మెప్మా ద్వారా రుణ సదుపాయం కల్పిస్తుండడం వంటి అంశాలను వివరిస్తూ లబ్దిదారులు ఇల్లు నిర్మించుకునేలా చూడాలని, తద్వారా ప్రభుత్వ సంకల్పం నెరవేరేందుకు దోహదపడాలని కలెక్టర్ సూచించారు. ఆయా వార్డులలో నెలకొని ఉన్న పరిస్థితులపై వార్డు ఆఫీసర్లకు పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయగలుగుతారని అన్నారు. కాగా, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, వాటిని నాటి పరిరక్షించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. గత సీజన్ లో నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యానికి మించి మొక్కలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మొక్కలను ఆయా కేటగిరీలుగా విభజిస్తూ, పూలు, పండ్ల మొక్కలను నివాస గృహాల కోసం పంపిణీ చేయాలని, మూడు మీటర్ల వరకు ఎత్తు కలిగిన మొక్కలను అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ ల కోసం వినియోగించాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా పక్కాగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను, ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నివాస ప్రాంతాల నడుమ ఖాళీ ప్రదేశాలలో నిలువ నీరు ఉండకుండా చూడాలని అన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు మురికి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయాలని, మంచినీటితో కూడిన వనరులలో గంబుషియా చేప పిల్లలు వదలాలని సూచించారు. ప్రతి శుక్రవారం అన్ని నివాస ప్రాంతాల్లో, వ్యాపార వాణిజ్య సంస్థలలో విధిగా డ్రై డే పాటించేలా చూడాలన్నారు. ఎక్కడైనా టైఫాయిడ్, మలేరియా, డెంగీ, విష జ్వరాలు వంటి పాజిటివ్ కేసులు నమోదు అయితే, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, స్థానికుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన ప్రొసీడింగ్ లు అందించాలని, అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ బోధన్ పట్టణంలోని పాండుఫారం తర్పాను సందర్శించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులను కలిశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఇళ్ళను నిర్మించుకోవాలని, అవసరమైన తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular