రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్: ఆగస్టు 31 ద్రోణ
తెలంగాణకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సాధించుకుంటే జీవితాలు మారిపోతాయని భావించి ప్రజలకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని ఆమె అన్నారు. సోమవారం నిజామామాబాద్ లో ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప సభలో కవిత ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగిండ్లు మాత్రమే బంగారు మాయమయ్యాయని అన్నారు. సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు బాగుపడాల్సిన అవసరముందని అందుకోసం సామాజిక న్యాయ తెలంగాణ అవసరమని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం 20 ఏళ్లు కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్ నుంచి నిర్దాక్షణ్యంగా వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదవుల కోసం పార్టీ పెట్టలేదని తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసం పంతం పట్టి పార్టీ పెట్టానని అన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన 4 నెలల తర్వాత సొంతూరు నిజామాబాద్ కు రావటం సంతోషంగా ఉందని కవిత అన్నారు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీ ఏ విధంగా ఆశీర్వాదం ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఆశీర్వాదం ఇవ్వాలని కవిత నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సొంత గడ్డపై సొంత మనుషులను చూసి భావోద్వేగానికి లోనైన కవిత
తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రజల జీవితాల్లో అనుకున్న స్థాయిలో మార్పు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పిన బీఆర్ఎస్ హయాంలో నలుగురి ఇండ్లు మాత్రమే బంగారం మాయం అయ్యాయని చెప్పారు. ప్రజల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. బంగారు తెలంగాణ కాదు, ఇప్పుడు కావాల్సింది బహుజన తెలంగాణ అని కవిత అన్నారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సి ఉందన్నారు. అందుకోసం చిత్తశుద్ధితో పనిచేసేందుకే తాను పార్టీ పెట్టానన్నారు. పదవుల కోసమైతే ఏ రాజకీయ పార్టీలోకైనా వెళ్లవచ్చని…కానీ తాను చూడని పదవులు లేవన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న పతంతోనే నేను పార్టీ పెట్టానన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన 4 నెలల తర్వాత తన సొంతగడ్డ నిజామాబాద్ కు రావటం సంతోషంగా ఉందని చెప్పారు. సొంత గడ్డపై సొంత మనుషులను చూసి కవిత భావోద్వేగానికి లోన య్యారు. ఎంత ఆపుకుందామనుకున్న కన్నీళ్లు ఆగటం లేదంటూ ఈ సందర్భంగా ఆమె అన్నారు. అలాగని తనను పిరికిదాన్ని అనుకోవద్దని ఆడబిడ్డల గుండెల్లో బాధ ఉంటే కన్నీళ్లు వస్తాయని చెప్పారు. ఇక గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీ గెలిపించి తనను ఎలా ఆశీర్వదించారో అదే విధంగా తనకు ఆశీర్వాదం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏ తప్పు చేయకున్న సరే తీహార్ జైల్లో పెట్టినప్పటికీ ధైర్యం సడలలదేని, దారి తప్పలేదని కవిత గుర్తు చేసుకున్నారు. అప్పుడే తాను తప్పు చేయలేదని, నిజామాబాద్ నిప్పు బిడ్డనని చెప్పానని అన్నారు. ఈడీ, సీబీఐ తనను ఇబ్బంది పెట్టిన సమయంలో అండగా ఉండాల్సిన బీఆర్ఎస్ పార్టీ నిర్ధాక్షణ్యంగా తనను బయటకు పంపించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పై కక్షతో తనను అరెస్ట్ చేశారని చెప్పిన బీఆర్ఎస్ పెద్దలు ఆ తర్వాత ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు పంపిన సరే తాను ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని అందుకే పార్టీ పెట్టానని కవిత చెప్పారు.
కాంగ్రెస్ పై పోరాటం టీఆర్ఎస్ నిర్మాణం
తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం ఐదు కీలకాంశాలతో తాము ముందుకు వెళ్తున్నట్లు కవిత చెప్పారు. పాంచజన్యం పేరుతో ఐదు కీలకాంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నామన్నారు. ఉచిత విద్య, వైద్యం ప్రతి కుటుంబానికి ఇస్తామన్నారు. ఇందుకోసం డబ్బులు ఎక్కడివి అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తారని…కానీ మన ఆదాయమే ఏటా 2 లక్షల కోట్లు ఉందని కవిత అన్నారు. అందులో లక్ష కోట్లు పెడితే ఉచిత విద్య, వైద్యం అందించవచ్చని చెప్పారు. బహుజన తెలంగాణ అంటే అన్ని కులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పారు. ఏ కులం వెనుకబడిన తెలంగాణ ముందుకు వెళ్లదని చెప్పారు. అగ్రవర్ణాల్లో పేదలు కూడా బాగుపడాలని కవిత అన్నారు. అందుకోసం ఓ వైపు కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తూనే మరోవైపు టీఆర్ఎస్ పార్టీని నిర్మాణం చేసుకుంటామన్నారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కవిత స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటితో వెయ్యి రోజులైనప్పటికీ ఇప్పటికీ వాళ్లు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కవిత విమర్శించారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీని నిలదీయాలా వద్దా అని ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్లు పెట్టే ఈ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత తిట్ల దండకం అందుకుంటారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల జీవితాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజల సొమ్ము దోచుకుంది
బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అడ్డగోలుగా అవినీతికి పాల్పడిందని కవిత మండిపడ్డారు. పదేళ్లలో దోచుకున్న డబ్బులను బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ లెక్కపెడుతున్నారని చెప్పారు. ఆ డబ్బు అహంకారంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరిస్తున్నారని కవిత మండిపడ్డారు. బెదిరిస్తే భయపడే రోజులు పోయాయని బీఆర్ఎస్ ను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రధాన ప్రతిక్షంగా ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ గా ఉందని కవిత ప్రశ్నించారు. అవినీతి కారణంగా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ మిలాఖత్ అయ్యిందన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే చూస్తే ప్రజలు సమస్యల్లో ఉన్నప్పటికీ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకు ప్రజల కోసం పోరాటం చేయటం లేదో చెప్పాలన్నారు. జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అక్రమాలపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కు ఉన్న అండర్ స్టాండింగ్ ఏంటో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అవినీతిలో నాకు పాత్ర లేదా అని చాలా మంది ప్రశ్నిస్తారని కవిత అన్నారు. కానీ జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు ఎమ్మెల్యేలు కాకముందు ఉన్న ఆస్తులు, ఆ తర్వాత వారి ఆస్తులను చూస్తే వారు ఎంత సంపాదించారో తెలుస్తుందన్నారు. తాను మాత్రం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉన్న కంపెనీ అమ్ముకున్నానని కవిత అన్నారు. పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారని అలాంటి నాయకులను మళ్లీ గెలిపిద్దామా అని కవిత ప్రజలను ప్రశ్నించారు.
ప్రశాంత్ రెడ్డిని జీవితంలో క్షమించను
నిజామాబాద్ జిల్లా నాయకుడు ప్రశాంత్ రెడ్డి పై కవిత తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రితో తనకు దూరం చేసిన వ్యక్తి ఆయనేనని అన్నారు. తండ్రి, కూతురును పాపిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డేనని చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు లను అయిన క్షమిస్తానేమో గానీ ప్రశాంత్ రెడ్డిని జీవితంలో క్షమించనని కవిత అన్నారు. తన ఉసురు కచ్చితంగా ఆయనకు తగులుతుందన్నారు. ప్రశాంత్ రెడ్డిని పెద్ద కొడుకులా చూసుకొని పిలిచి అన్నం పెట్టిన కేసీఆర్ కు అన్యాయం చేసే ప్రయత్నం చేశాడన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయిన రెండో రోజే కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నం చేశాడని చెప్పారు. ఆయను గెలిపించేందుకు తాను ఎంతో కష్టపడ్డానని, మంత్రి పదవి కూడా వచ్చిందని చెప్పారు. ఇంకా ఏం తక్కువైందని కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నం చేశాడో చెప్పాలన్నారు. నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లను నేను గెలిపిస్తే నన్ను వాళ్లు ఓడించారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ప్రజలే నా ధైర్యం
నిజామాబాద్ ప్రజలే నా ధైర్యమని కవిత చెప్పారు. తనను ఎంపీగా, ఎమ్మెల్సీగా ఇక్కడి ప్రజలు గెలిపించటంతోనే తాను ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలిగానని అన్నారు. ఇదివరకు మాదిరిగానే ఇప్పుడు కూడా తనకు నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కావాలని ఆమె కోరారు. తల్లి గారు కర్కశంగా బయటకు పంపిస్తే అత్తగారి కుటుంబమే తనను కన్న కూతురిగా ఆదరించిందని చెప్పారు. నిజామాబాద్ కోడలిగా తాను గర్వపడతానన్నారు. ఎంపీగా ఎమ్మెల్సీ ఉన్న సమయంలో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. బీడీ కార్మికులకు పోరాటం చేసి పెన్షన్ ఇప్పించానని కవిత గుర్తు చేశారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఎన్నో సార్లు కేసీఆర్ తో మాట్లాడినప్పటికీ ఆయన పట్టించుకోలేదని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు 18 కోట్లు ఇవ్వాలని కోరితే కేటీఆర్ ఇవ్వలేదన్నారు. అయితే తన స్నేహితుడు కోరుట్ల ఎమ్మెల్యే కోసమే కేటీఆర్ ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరవకుండా అడ్డుపడ్డాడని కవిత చెప్పారు. సారంగపూర్ లో షుగర్ ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తున్న కార్మికులకు అండగా ఉంటామని కవిత చెప్పారు. నిజామాబాద్ లో ప్రజలకు ఏ కష్టమొచ్చినా సరే టీఆర్ఎస్ శ్రేణులు ముందుండి పోరాటం చేస్తాయన్నారు .
అర్వింద్ పేరులోనే ధర్మం. ఆయనలో ఉందంతా అధర్మమే
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేరులోనే ధర్మం ఉందని ఆయనలో ఉన్నదంతా అధర్మమే అని కవిత విమర్శించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో మాధవ్ నగర్ బ్రిడ్జి పనులు పూర్తి కాలేదని విమర్శించిన అర్వింద్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు తాను కేకే ట్యాక్స్ వసూలు చేశానని మాట్లాడిన అర్వింద్ ఇప్పుడు ఏం ట్యాక్స్ వసూల్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే అడ్డగోలుగా మాట్లాడే అర్వింద్ కేంద్రం నుంచి ఎన్ని పైసలు తెచ్చారో చెప్పాలన్నారు. పసుపు బోర్డు కారణంగా రైతులకు పైసా మేలు జరగలేదని కవిత విమర్శించారు.













