Monday, September 28, 2026

ఓటుహక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరుబాట

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి..

గాంధీచౌక్‌లో భారీ నిరసన
ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి డిమాండ్‌..

నిజామాబాద్, సెప్టెంబర్ 28 ద్రోణ:- ఎన్నికల సంఘంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాన్ని రాజీనామా చేసే వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును హరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలిపై ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్ లు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఈ పరిణామాలు ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోందని తెలిపారు. ప్రతి పౌరుడి ఓటుహక్కును పరిరక్షించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు


తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని భూపతి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అర్బన్‌లో అభివృద్ధి జరగడం లేదంటూ బీజేపీ నాయకులు ధర్నాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. అర్బన్ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా, అదే పార్టీ నాయకులు అభివృద్ధి జరగడం లేదంటూ ఆందోళనలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటుహక్కు సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కిషన్, అంబర్ సింగ్, గోవర్ధన్, రవి, నరేష్, సంజయ్ రెడ్డి, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు వాసు, ఉపాధ్యక్షుడు మోహన్, నాయకులు అమృతాపూర్ గంగాధర్, బాగారెడ్డి, ఉమ్మాజి నరేష్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular