హెడ్ కానిస్టేబుల్ సాహసం!
గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన వేల్మురుగన్..

ముగ్గురు అరెస్ట్
కోయంబత్తూరు సెప్టెంబర్ 29 ద్రోణ :- గుట్కా, పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు వేగంగా కారును నడుపుతుండగా, హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ కారు పైభాగంపైకి ఎక్కి పట్టుకున్నారు. కారు వేగంగా వెళ్తున్నప్పటికీ పట్టు వదలకుండా సుమారు నాలబై (40) కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు సమాచారం.
బెంగళూరు నుంచి సుమారు మూడు వందల (300) కిలోల గుట్కా, పొగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలిస్తున్న కారును కోయంబత్తూరు సమీపంలో పోలీసులు తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కారు టాప్‌పైకి దూకి పట్టుకున్నారు. చివరకు పోలీసులు కారును అదుపులోకి తీసుకుని, గుట్కా అక్రమ రవాణాకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.

విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేసిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ పై ప్రజలు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.