ప్రభుత్వ భూమికి పట్టా?
మంగళ్‌పల్లి రెవెన్యూ పరిధిలో 4.25 ఎకరాల భూమిపై ఆరోపణలు.

భూభారతిలో నమోదు కావడంపై ప్రశ్నలు
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 01 ద్రోణ:- ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూమిగా మార్చి పాస్‌బుక్ పొందినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 96లో ఉన్న సుమారు 4.25 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో ఈ వ్యవహారం వెలుగుచూసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ భూమిని పట్టా భూమిగా మార్చి, పాస్‌బుక్ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సంబంధిత ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎంఆర్ఓను సంప్రదించగా, పత్రాలపై ఉన్న సంతకం తనది కాదేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

భూభారతిలో నమోదు ఎలా జరిగింది?
ప్రభుత్వ భూమిగా ఉన్న సర్వే నంబర్ 96లోని 4.25 ఎకరాలు వహీదా బేగం పేరుతో భూభారతి వెబ్సైట్లో నమోదు కావడం ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ఉపయోగించిన పత్రాలు, వాటిపై ఉన్న సంతకాలు, రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయన్న అంశాలపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వ భూమికి రక్షణ లేదా?
విలువైన ప్రభుత్వ భూములు అక్రమంగా ఇతరుల పేర్ల పై నమోదవుతున్నాయనే ఆరోపణలు రావడం అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ జరిగిందా? ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తి పేరుపై ఎలా నమోదైంది? పాస్‌బుక్ ఎలా జారీ అయింది? భూభారతి రికార్డుల్లో నమోదు చేసే సమయంలో సంబంధిత అధికారులు ఎలాంటి ధ్రువీకరణ చేపట్టారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, రికార్డులను పరిశీలించి, తప్పిదం లేదా అక్రమం జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించడంతో పాటు, భూమి రికార్డుల్లో జరిగిన మార్పులపై పారదర్శకంగా వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు.