(174) నూట డేబై నాలుగు మంది ప్రాణాలు కాపాడిన పైలట్
గాల్లోనే విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ యత్నం…..

కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రమాదాన్ని అడ్డుకున్న కెప్టెన్ స్మిత్ మచ్చార్
న్యూఢిల్లీ అక్టోబర్ 01 ద్రోణ :- కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు భారతీయ పైలట్ ప్రదర్శించిన అసాధారణ ధైర్యం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి విమానాన్ని ప్రమాదంలోకి నెట్టిన ఘటనలో.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కెప్టెన్ 174 మంది ప్రాణాలను కాపాడినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. బుధవారం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 737 మ్యాక్స్8 విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్ మచ్చార్, కో-పైలట్ మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కో-పైలట్ కత్తితో కెప్టెన్‌పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా కిందికి దిగడం ప్రారంభించింది. కొద్ది సమయంలోనే విమానం దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి.
ప్రాణాపాయంలోనూ తలుపు తెరిచిన కెప్టెన్
తీవ్రంగా గాయపడి కాక్‌పిట్‌లో కిందపడిపోయినప్పటికీ కెప్టెన్ మచ్చార్ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటనే కాక్‌పిట్ తలుపును తెరిచేలా చర్య తీసుకున్నారు. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి చేరుకునే అవకాశం లభించింది. అప్పటికే విమానం అదుపు తప్పే పరిస్థితి ఏర్పడటంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాక్‌పిట్‌లోకి ప్రవేశించిన ప్రయాణికుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన యానివ్ హయూన్ కీలకంగా వ్యవహరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇతర ప్రయాణికులతో కలిసి ఆయన దాడికి పాల్పడిన కో-పైలట్‌ను అడ్డుకున్నారు. మరోవైపు విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఫ్లైదుబాయ్ పైలట్లు కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
తబూక్లో సురక్షిత ల్యాండింగ్
విమానం తబూక్లో దిగిన తర్వాత కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. విమానంలోని 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఫ్లైదుబాయ్ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను టెల్ అవీవ్‌కు తరలించింది. ఘటనపై సౌదీ, ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కో-పైలట్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. దాడి వెనుక ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
‘నిజమైన హీరో’ అంటూ ట్రంప్ ప్రశంస
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను ‘హీరో’గా అభివర్ణించారు. ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ పోరాడి విమానాన్ని కాపాడారని, ప్రయాణికులు కూడా ధైర్యంగా జోక్యం చేసుకున్నారని తెలిపారు. ఈ వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు.
‘నా సెల్యూట్’.. నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కెప్టెన్ మచ్చార్ ధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినా వెనుకడుగు వేయకుండా ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరవడం ద్వారా ప్రయాణికులు, సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేలా చేశారని తెలిపారు. ఆయన చర్యల వల్ల 174 మంది ప్రాణాలు కాపాడబడ్డాయని నెతన్యాహు పేర్కొంటూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
15 ఏళ్లుగా విమానయాన రంగంలో..
కెప్టెన్ స్మిత్ మచ్చార్ భారతీయ పైలట్. ముంబైకి చెందిన ఆయనకు సుమారు 15 ఏళ్ల విమానయాన అనుభవం ఉన్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. 2022లో ఫ్లైదుబాయ్‌లో చేరకముందు దాదాపు 11 ఏళ్లపాటు స్పైస్‌జెట్‌లో పనిచేశారు. ఆయనకు 9,750 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది.
ఆకాశంలో ప్రాణాపాయ పరిస్థితి ఎదురైనా.. తన ప్రాణాల కంటే విమానంలోని ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిచ్చిన కెప్టెన్ మచ్చార్ ధైర్యసాహసాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.