డబ్బుల కోసం అమ్మమ్మను హతమార్చిన మనవడు!

బంగారు, వెండి ఆభరణాల కోసమే ఘాతుకం…..

పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు సమాచారం

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ అక్టోబర్ 01 ద్రోణ :- డబ్బుల కోసం వరుసకు అమ్మమ్మ అయిన 70 ఏళ్ల వృద్ధురాలిని మనవడు హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట్‌లో వెలుగుచూసింది. వృద్ధురాలి వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలపై కన్నేసిన నిందితుడు ఆమెను హత్య చేసి ఆభరణాలతో పరారైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తూప్రాన్‌పేట్‌ కు చెందిన మంటిపల్లి యాదమ్మ (70) ఈ నెల 27న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సాధారణ మరణం కాదనే అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులను విచారించడంతో పాటు ఆమె మృతికి ముందు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు.

బంధువుపైనే అనుమానం

దర్యాప్తులో భాగంగా మృతురాలి బంధువైన మంటిపల్లి రాజు (31)పై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో అతడిని బుధవారం అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. తొలుత ఘటనకు సంబంధించి వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నించగా.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

పోలీసుల విచారణలో రాజు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. డబ్బుల అవసరంతో యాదమ్మను హత్య చేసినట్లు అతడు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.

ఆభరణాల కోసమేనా?

వృద్ధురాలి వద్ద ఉన్న ఆభరణాలే హత్యకు ప్రధాన కారణమా? లేక డబ్బులకు సంబంధించిన మరేదైనా వ్యవహారం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. నిందితుడు చెప్పిన వివరాలను పోలీసులు ఇతర ఆధారాలతో సరిపోల్చి చూస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో అతడి కదలికలు, మృతురాలితో ఉన్న సంబంధం, ఆభరణాల జాడ తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. కేసులో నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, దొంగిలించినట్లు చెబుతున్న బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత హత్యకు సంబంధించిన కారణాలు, నిందితుడి పాత్ర, స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular