జీఓ 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయుల ముట్టడి యత్నం..

జీఓ 190 అమలు చేయాలని డిమాండ్
హైదరాబాద్ అక్టోబర్ 02 ద్రోణ:- జీఓ 317తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జీఓ 190ను అమలు చేయాలని జీఓ 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. జీఓ 317 కారణంగా తమకు జరిగిన కేటాయింపులను పునఃపరిశీలించి, బాధితుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రత్యేకంగా ఉపాధ్యాయులను వారి ఇష్టానుసారం స్వగ్రామ జిల్లా లేదా సంబంధిత జోన్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.