భారత గగనతలంలో రెండు ధైర్యగాథలు
నాలుగు దశాబ్దాల తేడా….

ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మందిని కాపాడిన ఇద్దరు భారతీయులు
నిజామాబాద్ అక్టోబర్ 02 ద్రోణ :- విమానం వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం ముంచుకొస్తే.. క్షణాల్లో తీసుకునే నిర్ణయమే వందలాది ప్రాణాలకు దిక్సూచిగా మారుతుంది. అలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రాణాల కంటే ఇతరుల ప్రాణాలకు ప్రాధాన్యమిచ్చిన ఇద్దరు భారతీయుల ధైర్యగాథలు ఇప్పుడు మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 1986లో నీరజ భనోత్.. 2026లో కెప్టెన్ స్మిత్ మచ్చార్.. నాలుగు దశాబ్దాల తేడాతో తమ కర్తవ్యనిబద్ధత, ధైర్యసాహసాలతో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
ఉగ్రవాదుల చెరలో చిక్కిన విమానం….
నీరజ అసమాన ధైర్యం
1986 సెప్టెంబర్ 5. కరాచీ విమానాశ్రయంలో పాన్ ఆమ్ ఫ్లైట్-73ను ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానంలో సుమారు 360 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ సమయంలో సీనియర్ ఫ్లైట్ పర్సర్‌గా విధులు నిర్వహిస్తున్న భారతీయురాలు నీరజ భనోత్ పరిస్థితిని ఎదుర్కొనే బాధ్యతను చేపట్టారు.
కాక్‌పిట్ సిబ్బంది విమానం నుంచి బయటకు వెళ్లడంతో విమానం ఎగరలేని పరిస్థితి ఏర్పడింది. అనంతరం ప్రయాణికుల రక్షణ బాధ్యత నీరజతో పాటు సిబ్బందిపై పడింది. ఉగ్రవాదులు ప్రయాణికుల జాతీయతను గుర్తించేందుకు పాస్‌పోర్టులను కోరిన సమయంలో…..
అమెరికన్ ప్రయాణికులను గుర్తించకుండా ఉండేందుకు కొన్ని పాస్‌పోర్టులను నీరజ దాచిపెట్టినట్లు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి.
పరిస్థితి విషమించి కాల్పులు ప్రారంభమైనప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. అత్యవసర ద్వారాలను తెరిచి ప్రయాణికులను బయటకు వెళ్లేలా సహకరించింది. చిన్నారులను కాపాడే క్రమంలో ఉగ్రవాదుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఆమె త్యాగంతో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. నీరజ భనోత్ అసమాన ధైర్యానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం మరణానంతరం అశోక చక్ర పురస్కారాన్ని అందించింది. ఆమె ఈ పురస్కారం అందుకున్న తొలి మహిళగా, అప్పట్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. మానవతా ధైర్యానికి గుర్తింపుగా పాకిస్థాన్ నుంచి కూడా ఆమెకు తమ్ఘా-ఎ-ఇన్సానియత్ పురస్కారం లభించింది.
40 ఏళ్ల తర్వాత..
మళ్లీ అదే ధైర్యం
నాలుగు దశాబ్దాల తర్వాత.. 2026 సెప్టెంబర్ 30న విమానయాన ప్రపంచంలో మరో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జడ్-1073 విమానంలో కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై సహ పైలట్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు నివేదికలు వెల్లడించాయి.
విమానం 174 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘర్షణలో విమానం గణనీయంగా ఎత్తు కోల్పోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే అవకాశం ఏర్పడింది. అనంతరం విమానంలోని ఇతర పైలట్లు నియంత్రణ చేపట్టారు.
విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి దారి మళ్లించి సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
కర్తవ్యమే ప్రాణం కంటే ముందు..
స్మిత్ మచ్చార్ ధైర్యాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం, సంకల్పం వందలాది ప్రాణాలను రక్షించడంలో సహాయపడిందని పేర్కొన్నారు.
1986లో నీరజ భనోత్.. 2026లో స్మిత్ మచ్చార్. కాలం మారింది.. విమానాలు మారాయి.. పరిస్థితులు మారాయి. కానీ ప్రమాదం ఎదురైన వేళ స్వప్రాణాల కంటే ఇతరుల ప్రాణాలకు ప్రాధాన్యమిచ్చే కర్తవ్యనిబద్ధత మాత్రం మారలేదు. ఒకరు ఉగ్రవాదుల తుపాకీ కాల్పుల మధ్య ప్రయాణికులను కాపాడి అమరులయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ విమానంలోని వందలాది మంది ప్రాణాలను రక్షించేందుకు కీలకంగా వ్యవహరించారు.
ఈ రెండు ఘటనలు విమానయాన చరిత్రలో కేవలం ప్రమాదాలను తప్పించిన కథలు మాత్రమే కాదు.. క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వం, ధైర్యం, కర్తవ్యనిబద్ధత ఎంతటి మార్పు తీసుకురాగలవో చెప్పే రెండు తరాల స్ఫూర్తిగాథలు.