భవానీనగర్ పోలీసులపై ఫిర్యాదు..

సీసీటీవీ పరిశీలించి చర్యలు తీసుకోవాలని గతంలో ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 03 ద్రోణ:– భవానీనగర్ పోలీసులపై వచ్చిన ఫిర్యాదుపై హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌కు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ టి. మాధవీదేవి ఈ వ్యవహారాన్ని విచారించారు. అమనగర్ కు చెందిన వ్యాపారి మహ్మద్ షానవాజ్ ఆలం తనను ఎలాంటి కేసు నమోదు చేయకుండానే భవానీనగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎన్. కరుణకుమార్, ఎస్‌ఐ బి. పోచయ్య అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తన చేతులు, కాళ్లు కట్టేసి కొట్టారని, కళ్లలో కారం చల్లారని ఆయన ఆరోపించారు. అయితే తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. షానవాజ్ ఆలం చేసిన ఫిర్యాదును పరిశీలించడంతో పాటు భవానీనగర్ పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరగలేదని, ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ఆరోపిస్తూ షానవాజ్ ఆలం మరోసారి కోర్టును ఆశ్రయించి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు సీపీ సజ్జనార్‌కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.