
కొనసాగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి?
నిజామాబాద్, అక్టోబర్ 04 ద్రోణ:- పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యుడిపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది. తాజాగా నయారా ఎనర్జీ పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచింది. అక్టోబర్ 3 నుంచి దేశవ్యాప్తంగా సంస్థకు చెందిన 7,108 పెట్రోల్ బంకుల్లో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు, శుద్ధి చేసిన ఇంధన ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ వాహన వినియోగంపై ఆధారపడే ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, రైతులు అదనపు ఖర్చును భరించాల్సి వస్తుంది. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య ఇంధన ధరలు తరచూ పెరుగుతూ పోతే కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై మరింత ఒత్తిడి పడుతుంది. డీజిల్ ధర పెరగడం వల్ల సరుకు రవాణా, వ్యవసాయ పనుల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరిగి దాని భారం చివరకు వినియోగదారుడిపైనే పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంధన ధరల పెంపు ఒకసారి జరిగితే భరించగలిగినా.. ఇదే ధోరణి కొనసాగితే సామాన్యుడి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల నియంత్రణ, స్థిరత్వం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.