భూమికి చేరువగా శనిగ్రహం

సాయంత్రం 5.59 గంటల నుంచి కనువిందు..
పరికరాలు లేకుండానే వీక్షించే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్04ద్రోణ:- ఆకాశ వీక్షకులకు ఆదివారం సాయంత్రం అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. శనిగ్రహం భూమికి అత్యంత సమీపంగా కనిపించనుంది. సాయంత్రం 5.59 గంటల నుంచి తూర్పు ఆకాశంలో లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా దర్శనమివ్వనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే రాత్రి వేళ శనిగ్రహాన్ని వీక్షించవచ్చని పేర్కొంది. బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ సహాయంతో శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలను కూడా చూడవచ్చని తెలిపింది. భూమికి సుమారు 126 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే శనిగ్రహం, గత ఏడాది సెప్టెంబర్ 21న కూడా భూమికి సమీపంగా కనిపించింది. ఆదివారం మరోసారి ఈ అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుండటంతో ఆకాశ వీక్షకుల్లో ఆసక్తి నెలకొంది.