రెండు రోజుల్లో 15 మంది మృతి..

ఒక్కరోజే ఏడుగురు మృతి చెందినట్లు ఆరోపణలు
హైదరాబాద్ అక్టోబర్ 04 ద్రోణ-: సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో వరుసగా రోగులు మృతి చెందుతున్నారంటూ పలు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సెప్టెంబర్ 22న ఒక్కరోజే ఏడుగురు రోగులు మృతి చెందినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో కలిపి మొత్తం 15 మంది మృతి చెందినట్లు పేర్కొంటున్నారు.
సెప్టెంబర్ 22న అక్తా తునిసా, జి. అరుణ దేవి, చంద్రకళ, దుంపాల మాణిక్యమ్మ, కృష్ణ జంగయ్య, జి. మేరీ ఫాతిమా, అల్లాచెరువు వెంకట గిరి ప్రసాద్ అనే ఏడుగురు రోగులు మృతి చెందినట్లు ఆరోపణల్లో పేర్కొన్నారు.
అక్తా తునిసా అనే రోగి సెప్టెంబర్ 21న బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ, చికిత్స పేరుతో సుమారు రూ.10 లక్షలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. అలాగే చికిత్సకు ముందుగా రూ.10 లక్షల ప్యాకేజీగా మాట్లాడుకుని, అనంతరం రూ.30 లక్షలు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి సిబ్బంది చెప్పినట్లు మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఈ పరిణామాలపై రోగుల బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసుపత్రిలో జరిగినట్లు చెబుతున్న మరణాలు, చికిత్సా విధానం, వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇవ్వాల్సి ఉంది.