కేకలు విని పరుగెత్తుకొచ్చిన స్థానికులు..
సాహసంతో బయటకు లాగి ప్రాణాలు కాపాడిన యువకులు
రుద్రూరు04ద్రోణ :– నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న ఓ వృద్ధురాలిని స్థానికులు సాహసోపేతంగా రక్షించి ప్రాణాలు కాపాడారు. సకాలంలో స్పందించి నీటిలోకి దిగి ఆమెను బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన రుద్రూరు మండలం సులేమాన్‌నగర్ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.
సులేమాన్‌నగర్ నుంచి రాయకూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఉన్న నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలో ప్రస్తుతం నీటి ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రుద్రూరు అంబేద్కర్ కాలనీకి చెందిన కిషోర్ రోడ్డుపైకి వచ్చి తన తల్లిని కాపాడాలంటూ ఆందోళనతో కేకలు వేయడంతో అక్కడున్న వారు అప్రమత్తమయ్యారు.
కిషోర్ కేకలు విన్న అశోక్ కామ్లే, అహ్మద్, బాబు తదితరులు వెంటనే కాలువ వైపు పరుగులు తీశారు. అక్కడ నీటి ప్రవాహంలో ఓ వృద్ధురాలు కొట్టుకుపోతూ చేతులు పైకెత్తి సహాయం కోసం ప్రయత్నిస్తున్న దృశ్యం కనిపించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానికులు కాలువ ఒడ్డుకు చేరుకుని ఆమెకు చేతులు అందించి బయటకు లాగారు.
అప్పటికే వృద్ధురాలు నీరు మింగడంతో మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో వెంటనే కారులో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ఆమె కోలుకున్నట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆమెను రక్షించిన వారు ఊపిరి పీల్చుకున్నారు.
‘ఓ తల్లి ప్రాణం కాపాడిన సంతోషం ఎంతో గొప్పది’ అంటూ రక్షణలో పాల్గొన్న వారు ఆనందం వ్యక్తం చేశారు. భగవంతుడు, అల్లా తమకు ఒక తల్లి ప్రాణాలను కాపాడే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో కిషోర్‌తో పాటు బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు వినోద్ తదితరులు కీలకంగా స్పందించి వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించడంలో సహకరించారు.
ప్రాణాలకు తెగించి వృద్ధురాలిని రక్షించిన స్థానికుల సాహసాన్ని పలువురు అభినందించారు.