43వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

విడాకులు, కుమారుడి వైద్యం, అప్పుల ఒత్తిడితో తీవ్ర మనస్తాపం….

రూ.3 కోట్ల భరణం ప్రచారాన్ని ఖండించిన పోలీసులు

నోయిడా, అక్టోబర్ 04ద్రోణ:-
నోయిడాలోని సూపర్‌నోవా భవనంలో 43వ అంతస్తు నుంచి దూకి 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సంభవ్ జైన్ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గురుగ్రామ్‌లోని మానేసర్‌కు చెందిన సంభవ్ జైన్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం సెక్టార్‌-94లోని సూపర్‌నోవా భవనంలోని ఎయిర్‌బీఎన్‌బీ గదిలో ఒంటరిగా బస చేసిన ఆయన ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ వివాదాలు, విడాకుల వ్యవహారం, కుమారుడి వైద్య ఖర్చులు, అప్పులు తదితర అంశాలు ఆయనపై తీవ్ర ఒత్తిడికి కారణమైనట్లు వెల్లడైంది. సంభవ్‌కు పుట్టిన కుమారుడు ముందస్తుగా జన్మించడంతో వైద్య చికిత్సకు కుటుంబం సుమారు రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో భార్యతో విభేదాలు ఏర్పడి విడాకుల వ్యవహారం కోర్టుకు వెళ్లినట్లు వెల్లడించారు.

రూ.3 కోట్ల భరణం కాదట

సోషల్ మీడియాలో సంభవ్ జైన్‌కు విడాకుల అనంతరం రూ.3 కోట్ల భరణం చెల్లించాల్సి వచ్చిందని, అందులో రూ.1 కోటి చెల్లించారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం విడాకుల సెటిల్‌మెంట్ మొత్తం సుమారు రూ.15 లక్షలుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందులో సుమారు రూ.7 లక్షలు ఇప్పటికే చెల్లించగా, మరో రూ.7.50 లక్షల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇతర అప్పులు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం

మరణానికి ముందు కొద్ది రోజులుగా సంభవ్ తన తండ్రితో చాట్‌లో డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనల గురించి మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కొద్దిసేపటి ముందు సమీపంలోని ఫ్లాట్‌లో ఏసీ మరమ్మతులు చేస్తున్న కార్మికులు అతడిని బాల్కనీ రైలింగ్ వద్ద గమనించి వెనక్కి రావాలని కోరినట్లు సమాచారం. తాను డిప్రెషన్‌లో ఉన్నట్లు వారికి చెప్పిన అనంతరం కిందకు దూకినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న చివరి సందేశం సహా ఇతర అంశాలను పోలీసులు పూర్తిగా ధృవీకరించాల్సి ఉంది. అందువల్ల వాటిని నిర్ధారణ లేని సమాచారంగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular