2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు..
బుర్రిపాలెం నుంచి 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

మరో 6 లక్షల ఇళ్ల మంజూరుకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీ..
3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో 177 ఇళ్ల నిర్మాణం
తెనాలి, అక్టోబరు 04ద్రోణ:- రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ 2029 నాటికి వంద శాతం పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదలకు సొంతిల్లు సమకూరితే వారి జీవన ప్రమాణాలతో పాటు ఆత్మగౌరవం కూడా పెరుగుతుందని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ఆదివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
‘పేదలకు పట్టాభిషేకం’
కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు కుటుంబంతో కలిసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రానికి సాధారణ కోటా కింద 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుత 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపే మరో 3 లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 3 లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి అంగీకరించారని చెప్పారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 9 లక్షల ఇళ్ల మంజూరుకు కేంద్రం సహకరిస్తోందన్నారు.
పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలనే ఆలోచనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని చంద్రబాబు గుర్తుచేశారు. 3 లక్షల ఇళ్ల నిర్మాణం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం కాదని, 3 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పునకు నాంది అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ చేరువ చేసేలా సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు.
3డీ ప్రింటింగ్‌తో 177 ఇళ్లు
గృహ నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు బుర్రిపాలెంలో రూ.14 కోట్లతో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికత ఆధారంగా 177 ఇళ్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్‌ఐ), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి పరిశీలించారు.
3డీ ప్రింటింగ్ సాంకేతికతతో తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో పటిష్టమైన ఇళ్లను నిర్మించవచ్చని అధికారులు వివరించారు. కేవలం పది రోజుల్లో ఒక ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ సాంకేతికతతో నిర్మించే ఇళ్లలో బయట వాతావరణంతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.
పేదలకు రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలు
‘పేదలకు పట్టాభిషేకం’లో భాగంగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పేదలకు నివాస స్థలాలు అందించినట్లు సీఎం తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి సహా వివిధ ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు అందించామని చెప్పారు.
ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ అజెండా అని స్పష్టం చేశారు. గత పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. 2019–24 మధ్య 6 లక్షల పేదల ఇళ్లను రద్దు చేశారని, నివాసయోగ్యం కాని చెరువులు, గుట్టల్లో ఇంటి స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. దాదాపు 4 లక్షల మంది ఆ స్థలాలను తిరిగి ఇచ్చేశారని తెలిపారు.
పోలవరం పూర్తి చేసి నీటి సమస్యకు పరిష్కారం
పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి పోలవరం పూర్తయ్యేలోగానే గోదావరి జలాలను వినియోగించుకున్నామని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో వంటి తీవ్ర పరిస్థితుల్లోనూ కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించి పంటలను కాపాడగలిగామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు.
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించామని, రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఉద్యాన ఫలాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
‘షైనింగ్ ఆంధ్రా’గా రాష్ట్రం : చౌహాన్
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ విజనరీ నేత చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ‘షైనింగ్ ఆంధ్రా, అడ్వాన్స్‌డ్ ఆంధ్రా, అచీవింగ్ ఆంధ్రా’గా మారుతోందని కొనియాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న చంద్రబాబు సంకల్ప బలం గొప్పదని ప్రశంసించారు.
3డీ కాంక్రీట్ ప్రింటింగ్
సాంకేతికతతో ఏపీలో చేపడుతున్న గృహ నిర్మాణం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపే మరో 3 లక్షల ఇళ్లకు మంజూరు ఇస్తామని, అనంతరం మరో 3 లక్షల ఇళ్లను కూడా ఏపీకి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
రైతుల కోసం కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేల ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. గ్రామాల్లో డ్రెయిన్లు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. ఏపీని 360 డిగ్రీల కోణంలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
లబ్ధిదారులకు ఇంటి పట్టాలు
కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు, శివరాజ్‌సింగ్ చౌహాన్ లబ్ధిదారు కుటుంబానికి చెందిన ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి నూతన వస్త్రాలను బహూకరించారు. 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సూచికగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. అనంతరం లక్ష్మి అనే మహిళకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇంటి పట్టాను అందించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.