మమ్మల్ని అరెస్ట్ చేస్తే యువత సహించదు

CJP నేతల అరెస్టుకు కేంద్రం

కుట్ర చేస్తోందని సౌరవ్ దాస్ ఆరోపణ

న్యూఢిల్లీ అక్టోబర్ 05ద్రోణ:- CJP నేతలను అరెస్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా తదితరుల పేర్లు అరెస్టు చేయాల్సిన వారి జాబితాలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. నిరసనలను అణచివేసేందుకు అరెస్టుల మార్గాన్ని ఎంచుకుంటే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని సౌరవ్ దాస్ హెచ్చరించారు. తమను అరెస్ట్ చేసినా యువత వెనక్కి తగ్గదని, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళన కొనసాగుతుందని అన్నారు. అక్టోబర్ 2న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో CJP నేతలు పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా మహిళా జర్నలిస్టుతో పోలీసు అధికారి అసభ్యంగా ప్రవర్తించారంటూ CJP సహా పలువురు ఆరోపణలు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని CJP డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై రాజకీయ, ప్రజా వర్గాల్లోనూ స్పందనలు వ్యక్తమయ్యాయి. కాగా, ఎన్నికల కమిషన్‌పై తమ ఆందోళనలను కొనసాగిస్తామని CJP ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మరో భారీ నిరసన చేపడతామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇప్పటికే ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular