43.96 కి.మీ. ప్రధాన సొరంగంలో 79 శాతం పనులు పూర్తి..

2028 జూన్ నాటికి నీటి తరలింపునకు లక్ష్యం
హైదరాబాద్, అక్టోబర్ 05ద్రోణ:- శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగం పనుల్లో కీలక పురోగతి నమోదైంది. గతంలో ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలోని అత్యంత క్లిష్టమైన షియర్ జోన్ (బలహీనమైన శిలలు ఉన్న ప్రాంతం)ను సొరంగం నిర్మాణ బృందాలు విజయవంతంగా దాటాయి.
మొత్తం 43.96 కిలోమీటర్ల ప్రధాన సొరంగంలో ఇప్పటికే 79 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా సుమారు 9.1 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. ప్రమాదకరమైన, భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతాన్ని అధిగమించడం పనుల్లో ముఖ్యమైన మైలురాయిగా ప్రభుత్వం పేర్కొంది.
మిగిలిన పనులను వేగవంతం చేసి 2028 జూన్ నాటికి ప్రధాన సొరంగం నిర్మాణాన్ని పూర్తి చేసి, నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. SLBC పూర్తయితే ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలకు సాగునీటి లభ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉంది.